రేపు శాసనసభ కమిటీ హాల్ లో బీసీ ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశమవుతున్న నేపథ్యంలోబీసీ సంఘాలతో టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, వి.శ్రీనివాస్ గౌడ్, ప్రకాష్ గౌడ్ సమావేశం అయ్యారు. రేపటి భేటీ చర్చకు లేవనెత్తాల్సిన వివిధ అంశాలపై బీసీ సంఘాల నేతలతో సమాలోచనలు జరిపారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీ సమస్యలపై రేపు సమావేశం నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఏ ముఖ్యమంత్రి బీసీ సమస్యల పై అన్ని పార్టీల ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించిన దాఖలాలు లేవని తెలిపారు. జ్యోతి రావు పూలే మార్గాన్నే సీఎం కేసీఆర్ అనుసరిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు.
బీసీల సమస్యలపై ఓ అవగాహనకు వచ్చేందుకే బీసీ సంఘాలతో సమావేశమయ్యామని తెలిపారు. రాష్ట్రంలో బీసీ విద్యార్థుల కోసం 119 రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించిన చరిత్ర సీఎం కేసీఆర్‌దని ప్రశంసించారు. అన్నీ కుల వృత్తుల కోసం భారీగా నిధులు కేటాయిస్తున్న కేసీఆర్కు బీసీ సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ వివరించారు. ఎంబీసీలకు వెయ్యి కోట్ల బడ్జెట్ కేటాయించడం ఏ రాష్ట్రంలో జరగ లేదని అన్నారు. కొన్ని చిన్న చిన్న సమస్యలను బీసీ సంఘాల నేతలు తమ దృష్టికి తెచ్చారని…వాటిని సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చూస్తామన్నారు. బీసీలకు ప్రభుత్వం ఇంకా ఎంతో చేయబోతోందని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ప్రతినెలా బీసీ సంఘాలతో సమావేశం నిర్వహించి ఎప్పటికపుడు సమస్యలు పరిష్కరిస్తామన్నారు. అగ్రవర్ణ పేదల సంక్షేమం కోసం కూడా చర్యలు చేపట్టాలని కోరుతున్నామని అన్నారు. బీసీల కోసం సీఎం కేసీఆర్ పడుతున్న తపనను అణగారిన వర్గాలు ఎప్పటికీ మరిచి పోవని అన్నారు.