ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా… రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి ఐమాక్స్ వరకు దివ్యాంగుల అవగాహన నడక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు ఈటెల రాజేందర్, మహేందర్ రెడ్డి, సినీ నటులు రాజశేఖర్, జీవిత,వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఈటెల మాట్లాడుతూ … ఈ కార్యక్రమంలో ముగ్గురు మంత్రులు పాల్గొనడమే దివ్యాంగుల అభివృద్ధికి, ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. గత 14 ఏండ్లుగా దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని మంత్రి స్పష్టం చేశారు. అగడకుండానే దివ్యాంగులకు 15 వందల రూపాయల పెన్షన్ ఇస్తున్నామని గుర్తు చేశారు. ఉద్యమ కాలంలో దివ్యాంగుల హాస్టల్స్‌ను సందర్శించామన్న మంత్రి… అందుకే మెస్ చార్జీలను 100 రూపాయల నుంచి 150 రూపాయలకు పెంచామన్నారు.కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలతో ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్నట్లు ఈటెల వివరించారు. దివ్యాంగుల సంక్షేమం కోసం రూ. 33 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. సమాజంలో అసమానతలు తొలగించడానికే తెలంగాణ సాధించుకున్నామన్న మంత్రి… ఇప్పుడు అందరం ఒకటనే భావన కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. మరిన్ని సంక్షేమ పథకాలు చేపట్టడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు మంత్రి ఈటెల తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం మాటలతో కాలం గడిపే ప్రభుత్వం కాదు … ఈ ప్రభుత్వం చేతల ప్రభుత్వమని మంత్రి ఈటెల స్పష్టం చేసారు .