జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో అంటూ వారానికి రెండు రోజులు వచ్చే ఈ షో తెలియని తెలుగు వారంటూ ఉండరు. అంతలా పాపులారిటీ తెచ్చుకుంది జబర్దస్త్ ప్రోగ్రాం. అందులోను ఈ ప్రోగ్రామ్ ప్రారంభమైనప్పటి నుంచి సౌత్ ఇండియాలోనే టాప్ రేటింగ్ ఈ ప్రోగ్రాం సొంతం. జబర్దస్త్ పోటీగా ఇతర ఛానెళ్ల రియాలిటీ షోస్. డ్యాన్స్, గేమ్ వంటి ప్రోగ్రామ్‌లు ప్రసారం చేసినప్పటికీ జబర్దస్త్‌లా ప్రజలను ఆకట్టుకోలేక పోయాయి. దీంతో జబర్దస్త్ బుల్లితెరపై ఇప్పటికీ టాప్ రేటింగ్‌లో దూసుకుపోతోంది.
గురువారం, శుక్రవారం అయితే, రాత్రి 9.30 గంటలకు తమ పనులు ముగించుకుని జబర్దస్త్ కోసం టీవీ ముందు వాలిపోతున్నారు బుల్లితెర ప్రేక్షకులు. జబర్దస్త్ షో చేసే కమెడియన్లకు గిఫ్ట్‌గా వచ్చే డబ్బులు కేవలం కాంప్లిమెంటరీ మాత్రమే. తెర వెనుక అసలు పారితోషకం కళ్లు బైర్లు కమ్మేలా ఉంటుంది. అలా చాలా మందికి లైఫ్ ఇచ్చింది జబర్దస్త్.
అయితే, ఇటీవల కాలంలో జబర్దస్త్ కొంత పుంతలు తొక్కుతూ వివాదాలకు తెరలేపుతోంది. జబర్దస్త్ కమెడియన్ల పెన్నుకు పదును తగ్గిందా..? వారు అందుకుంటున్న పారితోషకానికి తగ్గట్టు స్కిట్‌లు పండటం లేదా..? అందుకే ప్రముఖులను, రాజకీయ నేతలను, సామాన్యులను దృష్టిలో ఉంచుకుని కామెడీ పండిస్తున్నారా..? అన్న ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నారు బుల్లితెర ప్రేక్షకులు. ఇందుకు నిదర్శనం హైపర్ ఆది, నరేష్ స్కిట్‌లే. మొన్నటి వరకు సినీ క్రిటిక్, బిగ్‌బాస్ (తెలుగులో మొదటి సీజన్) షో పాటిస్పెంట్ కత్తి మహేష్‌ను ఉద్దేవించి తమ స్కిట్‌లలో అవహేళనగా, విమర్శిస్తూ డైలాగ్‌లు పలకడం. అందులోనూ బట్ట, పొట్ట అంటూ మహేష్ కత్తిని ఉద్దేశిస్తూ అనడమే పై వ్యాఖ్యలకు నిదర్శనం.
అయితే, హైపర్ ఆది తన స్కిట్‌లలో ఇటీవల రాజకీయ నేతలనూ వదలడం లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జీఎస్‌టీపై పంచ్ వేసిన ఆది.. గురువారం ప్రసారమైన జబర్దస్త్ షోలో తమిళనాడు మాజీ సీఎం కరుణానిధిని సైతం వదల్లేదు. స్కిట్‌లో భాగంగా రైజింగ్ రాజును ఉద్దేశించి హైపర్ ఆది పంచ్ వేస్తూ.. నీలాంటిదే.. కొడుకు మంచి కరుణానిధి లాంటోడు కావాలని ముందుగానే వీల్ చైర్, కళ్లజోడు కొనిపెట్టిందంట అంటూ తమిళనాడు మాజీ సీఎంపై పంచ్ వేశాడు. ఈ షో కాస్తా.. చూసిన బుల్లితెర ప్రేక్షకులు.. హైపర్ ఆది.. తన స్కిట్‌లతో హద్దులు మీరుతున్నాడని, ఇకనైనా రాజకీయ నాయకులపై పంచ్‌లు వేయడం మానేస్తే హైపర్ ఆదికి మంచి భవిష్యత్ ఉందంటూ కౌంటర్లు వేస్తున్నారు.