రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగు నీరందించి తీరుతామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ అందుకోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. గురువారం సూర్యాపేట నియోజకవర్గంలో మంత్రి విస్తృతంగా పర్యటించారు. సూర్యాపేట మండలం యండ్లపల్లిలోని మూసీ ప్రాజెక్టు డీ-5 కాల్వ వద్ద సుమారు రూ.10 లక్షల వ్యయంతో పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పలుచోట్ల అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు. అంతకుముందు కలెక్టరేట్‌లో మంత్రి మిషన్ భగీరథ పనులపై సమీక్షించి, నత్తనడకన సాగటంపై ఇంజినీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ చివరి నాటికి పనులు పూర్తి చేయాలని, అందుకు కూలీల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. యండ్లపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మూసీ కాల్వల ఆధునీకరణ కోసం గత పాలకులు పైసా కూడా చెల్లించలేదని, సీఎం కేసీఆర్‌ను అడగ్గానే రూ.65 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. రాష్ట్ర ఏర్పాటు జరిగిన ఏడాదిలోనే సుమారు రూ.18 కోట్లతో మూసీ గేట్ల మరమ్మతులు చేశామని తెలిపారు. మూసీ కాల్వల ఆధునీకరణతో కాల్వల కింద 30వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. రూ.250కోట్లతో ఎస్సారెస్పీ కాల్వల మరమ్మతు పనులు జరుగుతున్నాయని, తద్వారా సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గాలకు సాగునీరందుతుందన్నారు. టేకుమట్ల మీదుగా వెళ్లే డీ-5 కాల్వ పూడిక పనులు 15 రోజుల్లోగా పూర్తి చేయాలని, కాల్వ పనులు పూర్తయిన వెంటనే 11 వందల ఎకరాలకు రెండు పంటలకు సాగునీరు అందుతుందని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ సురేంద్రమోహన్‌తోపాటు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.