రివ్యూ : జవాన్
రేటింగ్: 2.75/5
బ్యానర్ : అరుణాచల్ క్రియేషన్స్
తారాగణం : సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ కౌర్, ప్రసన్న, కోట శ్రీనివాసరావు, సత్యం రాజేష్, తదితరులు..
కూర్పు : ఎస్ ఆర్ శేఖర్
సంగీతం : తమన్
ఛాయాగ్రహణం : గుహన్
సమర్పణ : దిల్ రాజు
నిర్మాత : కృష్ణ
రచన, దర్శకత్వం : బివిఎస్ రవి
విడుదల తేదీ : డిసెంబర్ 01, 2017
మెగా కాంపౌండ్ నుండి తెలుగు తెరకు పరిచయం అయిన సుప్రీం హీరో సాయి థరమ్ తేజ్ మొదట్లో మినిమం గ్యారెంటీ చిత్రాలతో సుప్రీం హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తర్వాత తిక్క, నక్షత్రం, విన్నర్ చిత్రాలు వరుసగా ప్లాప్ అవడంతో కొంత డీలా పడ్డాడు. దీంతో ప్రముఖ రచయిత బివిఎస్ రవి దర్శకత్వంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఒక సోషల్ మెసేజ్ నేపథ్యంలో జవాన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పీక్ స్టేజ్‌లోకి వెళ్తుందనుకున్న కెరీర్ వీక్‌గా మారడంతో.. తేజుకి తప్పనిసరిగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి నెలకొంది. మరి హీరోగా తన కెరీర్‌కు కీలకమైన ఈ సినిమాతో మెగా మేనల్లుడు విజయాన్ని అందుకున్నాడో లేదో తెలియాలంటే ఈ రివ్యూలోకి వెళ్ళాల్సిందే.
ఇక జవాన్ కథ విషయానికి వస్తే.. జై (సాయి ధరం తేజ్) కు చిన్నప్పటి నుంచి దేశభక్తి చాలా ఎక్కువ. బాధ్యత గల వ్యక్తిత్వం గలవాడు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)లో మెంబర్‌గా ఉంటాడు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్‌డీవో)లో ఉద్యోగం సంపాదించాలనేది అతడి కోరిక. మరోపక్క కేశవ్(ప్రసన్న) హైటెక్ క్రిమినల్. ఉగ్రవాద దాడులకు పాల్పడుతుంటాడు. అనుకోకుండా ఆ టెర్రరిస్ట్ గ్యాంగ్‌ను ఎదుర్కొని దేశానికి నష్టం జరగకుండా కాపాడతాడు జై. దీంతో జై మీద కేశవ్ పగ పడతాడు. ఇండియన్ ఆర్మీ కోసం డీఆర్‌డీవో తయారు చేసిన ఆక్టోపస్ అనే మిస్సైల్‌ను జై ద్వారా సంపాదించాలని కేశవ్ నిర్ణయించుకుంటాడు. దీని కోసం జైని బెదిరించి అతని కుటుంబ సభ్యులను కేశవ్ తన అదుపులో పెట్టుకుంటాడు. ఈ పరిస్థితుల నుంచి జై ఎలా బయటపడ్డాడు.. కుటుంబాన్ని, దేశ సంపదను ఎలా కాపాడాడు.. ఒక కామన్ మ్యాన్ ఉగ్రవాదులను ఎలా ఎదిరించాడు.. అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే..!
దేశం, కుటుంబం కోసం తాపత్రయ పడే ఒక మధ్యతరగతి యువకుడి కథే ఈ జవాన్. అయితే దర్శకుడు బీవీఎస్ రవి రాసుకున్న కథలో ఎక్కడా కొత్తదనం కనిపించదు. హీరో, విలన్ మధ్య సన్నివేశాలను కూడా ఆసక్తికరంగా రాసుకోలేకపోయారు. వారిద్దరి మధ్య సాగే మైండ్ గేమ్ అంత ఇంట్రస్టింగ్‌గా అనిపించతు. సీరియస్‌గా సాగే కథలో మెహ్రీన్‌తో లవ్ ట్రాక్ డైవర్షన్‌లా కనిపిస్తుంది. ఇంటర్వెల్‌లో ఇచ్చే ట్విస్ట్ ప్రేక్షకులకు ముందుగానే అర్థమైపోతుంది. కాకపోతే రెండో భాగంలో ప్రీ క్లైమాక్స్ వరకు సినిమా చాలా వేగంగా పరుగులు పెడుతుంది. కథపై దర్శకుడు చేసిన కసరత్తు, పడిన కష్టానికి మంచి ఫలితమే కనిపిస్తుంది. రవి దర్శకుడిగా కంటే రైటర్‌గానే ఆయన రాసుకున్న సంభాషణలు ఆకట్టుకుంటాయి. దేశభక్తి గురించి వివరించే సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతాయి. హీరో పాత్రను ఎలివేట్ చేసిన విధానం బాగున్నా.. ఆశించిన స్థాయిలో సినిమాను రక్తి కట్టించలేకపోయారు.ఇంకాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసి స్క్రిప్ట్‌ను మరింత బాగా చేసి ఉంటే రవి, తేజూల కెరీర్‌లోనే బెస్ట్ చిత్రం అయ్యేదేమో.
ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్ సాయి ధరం తేజ్ నటన. ప్రతి సన్నివేశంలో ఎమోషన్‌ను బాగా పండించాడు. డాన్స్, యాక్షన్ సన్నివేశాల్లో అవలీలగా నటించేశాడు. గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో హీరోయిన్ మెహరీన్ కాస్త బొద్దుగా కనిపించింది. గ్లామర్ పరంగా యూత్‌ను ఆకట్టుకుంటుంది. ఇక విలన్‌గా నటించిన ప్రసన్న తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. తెలుగులో పూర్తిస్థాయి పాత్రలో నటించడం తొలిసారి అయినప్పటికీ తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తాడు. జయప్రకాష్, ఈశ్వరీ, సత్యం రాజేష్ తన పాత్రల పరిధుల్లో బాగానే నటించారు. మ్యూజిక్ విషయానికి వస్తే థమన్ మాత్ర మరోసారి రెచ్చిపోయాడు. సెకండాఫ్‌లో థమన్ అందించిన రీరికార్డింగ్ పీక్స్‌లో ఉందది. మైండ్ గేమ్ వర్కవుట్ కావడానికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆయువు పట్టుగా నిలిచింది. ఇక జవాన్ సాంగ్ ఇప్పటికే సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. గుహన్ అందించిన సినిమాటోగ్రఫీ సినిమా స్థాయిని పెంచింది. పాటల్లో విజువల్స్ బాగున్నాయి. ఎడిటింగ్ వర్క్ పర్వాలేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. చాలా కాలంగా పరిశ్రమలో ప్రొడక్షన్ బాధ్యతలను నిర్వహించిన కృష్ణ జవాన్ చిత్రంతో నిర్మాతగా మారాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పించాడు. రాజీ లేకుండా, ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను చాలా రిచ్‌గా రూపొందించారు. ఫైనల్‌గా చెప్పాలంటే కథ, కథనాల్లో కొత్తదనం లేకపోవడంతో రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో జవాన్ కూడా ఒకటిగా మిగిలిపోతుంది.