టీం ఇండియా మాజీ కెప్టెన్ ,ప్రస్తుత క్యాబ్ అధ్యక్షుడు అయిన సౌరబ్ గంగూలీ ,టీం ఇండియా మాజీ సీనియర్ లెజండరీ స్పిన్నర్ ,మాజీ కెప్టెన్ ,కోచ్ అయిన అనిల్ కుంబ్లే మధ్య ఉన్న దోస్తానం మనందరికీ తెల్సిందే .కెప్టెన్ గా గంగూలీ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కుంబ్లే వైపే చూసేవాడు .అంతగా వాళ్ళ మధ్య సాన్నిత్యం ఉంది .అయితే తాజాగా గంగూలీ కుంబ్లే గురించి సంచలన విషయం బయటపెట్టాడు .దాదా మాట్లాడుతూ “అప్పట్లో అనిల్ కుంబ్లేను జట్టులోకి తీసుకోకపోతే తాను ఆడనని సెలక్టర్లకు చెప్పేసినట్లు అన్నాడు.
2003-04 ఆస్ట్రేలియా పర్యటనకు జట్టును ఎంపిక చేసే సమయంలో సెలక్టర్లతో యుద్ధం చేసి మరీ జంబోను జట్టులోకి తీసుకునేలా చేశానని దాదా చెప్పాడు. ‘‘గత పాతికేళ్లలో భారత్ నుంచి వచ్చిన గొప్ప మ్యాచ్ విన్నర్లలో కుంబ్లే ఒకడు. తాను కాస్త ఫామ్ కోల్పోయాడనే వంకతో 2003-04 ఆస్ట్రేలియా పర్యటనకు సెలక్టర్లు అనిల్ పేరును జట్టులో చేర్చలేదు.
నేను సెలక్టర్ల సమావేశానికి వెళ్లిన వెంటనే ఆ విషయం అర్థమైంది. కుంబ్లే మ్యాచ్ విన్నర్ అని.. ఫామ్ కోల్పోవడం తాత్కాలికమేనని చాలాసేపు సెలక్టర్లను అభ్యర్థించాను. వాళ్లు నా మాట వినలేదు. చివరికి కోచ్ జాన్ రైట్ కూడా నువ్వు ఎంపిక ప్రక్రియ త్వరగా పూర్తి చేయి వెళిపోదాం అన్నాడు. నేను వదల్లేదు. కుంబ్లేనే తీసుకోకపోతే నేనూ ఆ జట్టులో ఉండను అని చెప్పేశాను. ఎట్టకేలకు నా ప్రయత్నం ఫలించింది. అనిల్ జట్టులోకొచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలిసిందే’’ అని సౌరభ్ అన్నాడు.