కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి జంప్ అయిన జేసీ బ్రదర్స్ అరాచకాలు రాను..రాను మితి మీరుతున్నాయి. ఎంపీగా జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేగా జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రత్యక్షంగా.. పరోక్షంగా తన అనుచరులతో అనంతపురం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అడ్డొస్తే హత్యలు, ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా, అక్రమ వసూళ్లు, మట్కా కేంద్రాలు, బెదిరింపులు, నిబంధనలకు విరుద్ధంగా ట్రావెల్స్.. ఇలా చెప్పుకోవాలంటే జేసీ బ్రదర్స్ అరాచకాలు అనేకం. ఓ వైపు చంద్రబాబు అండ.. మరో వైపు ఏం చేసినా అడిగే వారెవరున్నారన్న ధీమాతో అన్నతమ్ముళ్లు ఇద్దరూ విర్రవీగుతున్నా.. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలేమైతే తనకేంటీ.. నాకు కేడర్ ముఖ్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని అనంత ప్రజలే అంటున్నారు.
తాజాగా, పై వ్యాఖ్యలను రుజువు చేస్తూ టీడీపీ నేతలుగా కొనసాగుతున్న జేసీ దివాకర్‌రెడ్డి సోదరుల హత్యా రాజకీయం మరో సారి వెలుగులోకి వచ్చింది. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కాగా, తెలుగుదేశం పార్టీ నేత జేసీ దివాకర్ రెడ్డి తన కర్కశత్వాన్ని సామాన్య ప్రజలపై మరోసారి చూపించారు.
అయితే, రెండేళ్ల క్రితమే జేసీ వర్గీయుల చేతిలో వైఎస్ఆర్‌సీపీ నేత విజయభాస్కర్ హత్యకు గురైన విషయం తెలిసిందే. హత్య కేసుకు సంబంధించి రాజీకి రావాలని గత రెండేళ్లుగా జేసీ వర్గీయులు హత్యకు గురైన విజయభాస్కర్ సోదరి హరిప్రియపై ఒత్తిడి తీసుకువస్తున్నారని.. ఒకానొక సమయంలో మీడియా సమావేశాల్లో హరిప్రియ చెప్పారు కూడా. హరిప్రియ ఎంతకీ రాజీకి రాకపోవడంతో తమ హత్యా రాజకీయం బయటపడుతుందని భావించిన జేసీ సోదరులు తమ వర్గీయులతో హరిప్రియ హత్యకు ప్లాన్ చేశారు.
అందులో భాగంగానే హరిప్రియపై దాడిచేసి ఆమె చేతిని నరికేశారు జేసీ వర్గీయులు. ఈ దాడిలో హరిప్రియ తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనపై చికిత్స పొందుతున్న హరిప్రియ మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండటం లేదని తెలిపారు. టీడీపీ నాయకుల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ.. హత్య కేసులో రాజీ రావాలని చాలారోజులుగా జేసీ వర్గీయులు ఒత్తిడి తెస్తున్నారని, పోలీసు ఉన్నతాధికారులకు గతంలోనే ఫిర్యాదు చేసి పట్టించుకోవడం లేదంటూ హరిప్రియ లేఖ ఇది..