తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, సలహాదారు ఇవాంకా రెండు రోజులు పర్యటించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో మహిళ సాధికారతే ప్రధాన లక్ష్యంగా ‘ఉమెన్ ఫస్ట్-ప్రొస్పారిటీ ఫర్ ఆల్’ అనే నినాదంతో నగరంలో 8వ గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్ సదస్సు జరుగుతోంది. మొదటి రోజు ప్రారంభ కార్యక్రమంలో ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్న ఇవాంకా ట్రంప్ రెండో రోజు ఉదయం కేటీఆర్ అనుసంధానకర్తగా వ్యవహరించిన ‘శ్రామిక రంగంలో మహిళ’ అనే అంశంపై జరిగిన చర్చగోష్టిలో పాల్గొన్నారు.
ఈ చర్చలో భాగంగా తన కూతురు 6 ఏళ్ల వయసున్న అరబెల్లా గురించి ఇవాంకా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అరబెల్లా తనను తాను ఎక్కువగా నమ్ముతుందని, ఈ వయసులోనే మాండరిస్ భాషను అనర్గళంగా మాట్లాడుతుందని, కంప్యూటర్ కోడింగ్ తెలుసునని మురిసిపోయింది. తన కూతురే తనకు ప్రేరణ అని, కల్మషంలేని తన కూతురిని మెచ్చుకుంది. అరబెల్లాకు అత్మవిశ్వాసం చాలా ఎక్కువని, ఇలాంటి లక్షణాలే అందరిలో భిన్నంగా కనిపించేలా చేస్తాయని, తన కూతురే తనకు ఆదర్శమని ఇవాంకా అన్నారు.