తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో జరిగిన అంతర్జాతీయ వ్యాపారవేత్తల సదస్సు(జీఈఎస్), మెట్రో రైల్ ప్రారంభోత్సవం కార్యక్రమాలు విజయవంతమవడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. జీఈఎస్ తరువాత ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ ప్రతిష్ట మరింత పెరిగిందని సీఎం అన్నారు. దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రముఖులు, పారిశ్రామిక వేత్తల గౌరవానికి ఏ మాత్రం భంగం కలగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీసుల పనితీరును ప్రశంసిస్తూ కేంద్రం నుంచి సందేశం వచ్చిందని సీఎం కేసీఆర్ తెలిపారు.
అనేక మంది ప్రముఖులకు అసాధారణ రీతిలో భద్రతా ఏర్పాట్లు చేశారని కేంద్రం ప్రశంసించినట్లు చెప్పారు. ఒకే రోజు అనేక కార్యక్రమాలు ఉన్నప్పటికీ పోలీసులు సమర్థంగా విధులు నిర్వర్తించారని సీఎం కితాబిచ్చారు.డీజీపీ మహేందర్‌రెడ్డి అందరినీ సమన్వయం చేస్తూ అతిపెద్ద కార్యక్రమాన్ని విజయవంతం చేసిన్రని సీఎం తెలిపారు.రాష్ట్ర పోలీసులను అమెరికా సీక్రెట్ ఏజెన్సీ, కేంద్ర హోంశాఖ, నీతి ఆయోగ్, వివిధ దేశాల ప్రముఖుల నుంచి ప్రశంసలు లభించాయి. ఈ సందర్భంగా సీఎస్ ఎస్పీ సింగ్, డీజీపీ మహేందర్‌రెడ్డి, అధికార యంత్రాంగానికి సీఎం కేసీఆర్ అభినందనలు తెలియజేశారు.