వచ్చే నెల ( డిసెంబర్) 15 నుంచి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో జరిగే ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లపై ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు హరీశ్ రావు, ఈటెల రాజేందర్, సీఎస్, డీజీపీ, నందిని సిధారెడ్డి, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. తెలుగు భాసాభివృద్ధి కోసం పాటు పడుతున్న సాహితీవెత్తలందరి సమక్షంలో హైదరాబాద్‌లో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని సీఎం అన్నారు.రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితోపాటు తెలుగు భాష మాట్లాడే ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ప్రముఖులను మహాసభలకు ఆహ్వానించాలన్నారు.
తెలుగుతో పాటు ఇతర గుర్తింపు పొందిన భారతీయ భాషలకు చెందిన సాహితీ వేత్తలను కూడా మహాసభల సందర్భంగా గౌరవించి సన్మానించలని సీఎం నిర్ణయించారు. అతిథులకు బస, భోజనం, రవాణాలాంటి సదుపాయాల కల్పనలో జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం అన్నారు. ఒక్కో వేదిక వద్ద ఒక్కో ఇంచార్జ్ ఉండాలన్నారు.
ప్రారంభోత్సవానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మరిషస్ వైస్ ప్రెసిడెంట్ పరమ శివమ్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు హాజరవుతారని సీఎం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కూడా సభలను ఆహ్వానించనున్నట్లు సీఎం తెలిపారు. ముగింపు వేడుకలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వస్తారని సీఎం స్పష్టం చేశారు. తెలుగు మహాసభల ప్రధాన వేదిక, ఎల్బీ స్టేడియం వేదిక డిజైన్, నగరంలో ఏర్పాటు చేయాల్సిన తోరణాల డిజైన్లను పరిశీలించిన సీఎం వాటిని ఆమోదించారు. ప్రారంభ, ముగింపు కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని సీఎం తెలిపారు.ప్రతీ కార్యక్రమానికి ఒక మంత్రిని ఆహ్వానించి ప్రభుత్వం తరుపున తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా సన్మానం చేయించాలన్నారు.మహాసభల సందర్భంగా నగరాన్ని అందంగా ముస్తాబు చేయాలన్నారు.
ప్రారంభ, ముగింపు సభలు రెండూ ఎల్‌బీ స్టేడియంలోనే నిర్వహించాలని సీఎం స్పష్టం చేశారు. చివరి రోజు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చాలన్నారు. నగరమంతా అందమైన అలంకరణలుండాలని.. నగరం పండుగ శోభను సంతరించుకోవాలని.. ఎక్కడికక్కడ స్వాగత తోరణాలు ఏర్పాటు చేయాలని.. జంక్షన్లను అలంకరించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అన్ని నగరాల మేయర్లు, సివిల్ సర్వీస్ అధికారులు, కార్పొరేషన్ చైర్మన్లను ఆహ్వానించాలన్నారు. సైనా నెహ్వాల్, పీవీ సింధు, మిథాలీరాజ్, సానియా మీర్జా లాంటి క్రీడాకారులను కూడా మహాసభలకు ఆహ్వానించాలన్నారు. తెలుగు పండుగలు, సంవత్సరాలు, నెలలు, కార్తెలతో కూడిన పుస్తకాన్ని ముద్రించి మహాసభల సందర్భంగా పంపిణీ సీఎం తెలియజేశారు.