వరంగల్ జిల్లాలో త్వరలో మెంటల్ ఆస్పత్రి (మానసిక రోగుల ఆస్పత్రి) ని నెలకొల్పబోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో ఈ దవాఖానా ఏర్పాటు కాబోతుంది. రూ. 33 కోట్ల వ్యయంతో 75 పడకల సామర్థ్యంతో ఆస్పత్రి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలో హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలో ప్రస్తుతం మానసిక రోగుల ఆస్పత్రి ఉంది. ఇది మినహా ప్రభుత్వ రంగంలో మరో ఆస్పత్రి ఎక్కడా లేదు.కాకతీయ మెడికల్ కాలేజీ పరిధిలో మానసిక రోగుల ఆస్పత్రి ఏర్పాటు చేయాలంటూ ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రాం కింద ఈ పథకానికి నిధులు మంజూరు చేయాలని కోరారు.కాగా
మెంటల్ ఆస్పత్రికి కేటాయించిన రూ. 33 కోట్లలో రూ. 19.8 కోట్ల నిధులు కేవలం భవనానికి కేటాయించనున్నారు. మిగిలిన నిధులతో ఆస్పత్రికి అవసరమైన సామగ్రిని సమకూర్చుతారు. ఈ ఆస్పత్రి నిర్మాణానికి కనీసం మూడు ఎకరాల స్థలం అవసరం అవుతుంది. ప్రస్తుతం ఎంజీఎం ఆస్పత్రి ప్రాంగణంలో స్థల లభ్యత లేదు. దీంతో కేఎంసీ ప్రాంగణంలో నిర్మించాలా లేదా ఇతర ప్రాంతాల్లో నిర్మించాలా అనే అంశంపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.