గ్రంథాలయాలకు పున: వైభవం తీసుకువచ్చే విధంగా కొత్తగా వచ్చిన జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్లు, కార్యదర్శులు పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్లు, కార్యదర్శులతో సర్వ శిక్ష అభియాన్ సంస్థలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు.
గ్రంథాలయాలను పటిష్టం చేయాలన్న లక్ష్యంతో…మీమీద ఉన్న నమ్మకంతో ముఖ్యమంత్రి కేసిఆర్ 29 గ్రంథాలయాలకు పాలకమండళ్లను నియమించారని ఉప ముఖ్యమంత్రి కడియం అన్నారు. మిగిలిన రెండు గ్రంథాలయాలకు కూడా త్వరలోనే పాలక మండళ్లు ఏర్పాటు చేయనున్నారని చెప్పారు. ప్రస్తుతం నియామకమైన చైర్మన్లు స్థానికంగా మీకున్న పరపతిని ఉపయోగించి గ్రంథాలయాలను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకోవాలని కోరారు. ప్రతి చిన్న పనికి ప్రభుత్వంపై ఆధారపడకుండా స్థానికంగా వనరులు సమకూర్చుకునే ప్రయత్నం చేయాలన్నారు. త్వరలోనే కొత్తగా ఏర్పాటైన 21 గ్రంథాలయాలకు నూతన భవనాలు నిర్మించనున్నామని చెప్పారు. ప్రపంచ తెలుగు మహా సభల నేపథ్యంలో గ్రంథాలయాలకు కొత్త భవనాలు నిర్మించేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ అంగీకరించారని తెలిపారు. గ్రంథాలయాల భవనాలను జిల్లా కేంద్రాల్లోనే నిర్మించే విధంగా కలెక్టర్లకు ఆదేశాలిస్తామన్నారు. ఒక్కో గ్రంథాలయ భవనానికి కనీసం వెయ్యి గజాల చొప్పున కేటాయించాలని ఆదేశాల్లో పేర్కొంటామని గ్రంథాలయ సంస్థల చైర్మన్లకు హామీ ఇచ్చారు.
నూతన గ్రంథాలయాల్లో పుస్తకాల కొనుగోలుకు ఒక్కో గ్రంథాలయానికి 10 లక్షల రూపాయల చొప్పున మొత్తం 2.10 కోట్ల రూపాయలను మంజూరు చేస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. అయితే గతంలో పుస్తకాల కొనుగోలు అనగానే చాలా అవకతవకలు జరిగేవని, ఈసారి అలా జరగకుండా కొనుగోళ్లు చేపట్టాలన్నారు. ఏయే పుస్తకాలు కొనుగోలు చేయాలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిర్ణయించాలన్నారు.
గ్రంథాలయ ఉద్యోగులకు 010 పద్దు కింద వేతనాలు ఇప్పించాలని చాలా కాలంగా కోరుతున్నారని, వీరికి 010 పద్దు కింద వేతనాలు వచ్చేలా కృషి చేస్తానని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. అదేవిధంగా గ్రంథాలయాల్లో కనీస అవసరాలు సమకూర్చే సిబ్బంది నియామకానికి కూడా ముఖ్యమంత్రి కేసిఆర్ వద్ద అనుమతి తీసుకుని భర్తీ చేయించేందుకు ప్రయత్నం చేస్తానన్నారు. గ్రంథాలయాల్లో 700 ఖాళీలున్నాయని, ఇవి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ఉండడంతో వీటి భర్తీపై నిషేధం ఉన్నదని చెప్పారు. ముఖ్యమంత్రి కేసిఆర్ తో అనుమతి తీసుకొని వీటిని భర్తీ చేయాల్సి ఉంటుందన్నారు.
గతంలో గ్రంథాలయాలు పూర్తి నిర్లక్ష్యానికి, నిరాధరణకు గురయ్యాయని, అయితే సిఎం కేసిఆర్ తెలుగు భాషకు, విద్యకు ఇస్తున్న ప్రాధాన్యత వల్ల గ్రంథాలయాలకు కూడా ప్రాముఖ్యత లభిస్తోందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణను ఇష్టపడి అభివృద్ధి చేసుకోవాలని, బంగారు తెలంగాణ నిర్మాణంలో మానవ వనరులే కీలకమని అన్నారు. అయితే ఈ మానవ వనరుల అభివృద్ధి విద్యవల్లే సాధ్యమని, గ్రంథాలయాలు కూడా ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తాయన్నారు. అయితే కాలానుగుణంగా గ్రంథాలయాల పనితీరు, వసతులు కూడా మారాల్సి ఉందన్నారు. గ్రంథాలయాల్లో కంప్యూటర్లు, ఇంటర్నెట్, వైఫై సదుపాయాలను కల్పిస్తున్నామని చెప్పారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు కావల్సిన పుస్తకాలను అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. నిరుద్యోగ అభ్యర్థులు పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేసి అన్ని వసతులు కల్పించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. గ్రంథాలయాలను మరింత గొప్పగా తీర్చిదిద్దడంలో చైర్మన్లు వారి వంతు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో గ్రంథాలయాల సంస్థ చైర్మన్ శ్రీధర్, డైరెక్టర్ రమణ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.