ఏపీలో అధికార పార్టీ టీడీపీ..ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలను వరుసపెట్టి పార్టీలో చేర్చుకుంటున్న టీడీపీ.. పైకి చెప్పేదొకటి, లోపల చేసేదొకటి అన్న విషయాన్ని ఒక ప్రముఖ తెలుగు చానెల్ బయటపెట్టింది. అభివృద్దిని చూసి పార్టీలో చేరుతున్నారని టీడీపీ చెబుతుంటే.. నియోజకవర్గాల అభివృద్ది కోసమే పార్టీ మారుతున్నామని జంపింగ్ నేతలు చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పార్టీ మారిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కూడా అదే మాట చెప్పారు. కానీ ఆమె మాటల వెనుక అసలు మతలబు వేరే ఉందన్నది వైసీపీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న వాదన. గిడ్డి ఈశ్వరి పార్టీ మార్పు వెనుక ఉన్న అసలు విషయాలు సాక్షాధారాలతో సహా వారికి చిక్కినట్టు తెలుస్తోంది.
వీడియో టేపుల్లో గిడ్డి ఈశ్వరి ఏం మాట్లాడారంటే..’
పార్టీ మారేముందు కార్యకర్తల మీటింగ్లో గిడ్డి ఈశ్వరి మాట్లాడిన మాటలు.
‘‘చంద్రబాబు అంటే మాకేమీ ఇష్టమని వెళ్లడం లేదు.. మామూలుగా అయితే వెళ్లాలని లేదు.. ఆ పార్టీలోకి వెళ్లడం మాకు ఇష్టం లేదు. డిఫర్ అవడం వల్లనే వెళ్లాల్సి వస్తోంది.. నేను ఏం చెబుతున్నానంటే.. మంత్రివర్గ విస్తరణ రేపు జరిగితే.. రేపు.. ఎల్లుండి జరిగితే ఎల్లుండి మంత్రి పదవి ఇస్తామన్నారు.. జాయిన్ అయి వెళ్లిన వెంటనే మంత్రి ఇవ్వలేరు కాబట్టి ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ పదవి కేబినెట్ హోదాతో ఇస్తామన్నారు. రాష్ట్రంలోని మంత్రికి ఉన్నటువంటి పవర్స్ అన్నీ ఇస్తామన్నారు కాబట్టే వెళ్తున్నా.’’ అని చెప్పినట్లు స్పష్టంగా తెలుస్తుంది. అయితే వీడియో టేపులు చిక్కడంతో అటు టీడీపీని, ఇటు గిడ్డి ఈశ్వరిని వైసీపీ తీవ్రంగా మండిపడుతుంది. పైకి అభివృద్ది అని చిలకపలుకులు పలుకుతూ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పార్టీలు మారుతున్నారని విమర్శిస్తోంది. వైసీపీని నేరుగా ఎదుర్కోవడం చేతగాకనే ఇలా ప్రలోభాలతో దెబ్బతీస్తున్నారని ఆ పార్టీ వాపోతోంది.
