తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లో ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)లో రెండో రోజు బుధవారం మహిళా పారిశ్రామికవేత్తల నైపుణ్యాభివృద్ధి అంశంపై ప్లీనర్ జరిగింది. ఈ చర్చ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ సమన్వయకర్తగా వ్యవహరించగా.. ముఖ్య అతిథి ఇవాంకా ట్రంప్‌తోపాటు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సతీమణి చెర్రీ బ్లెయిర్, ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ చందా కొచ్చార్, డెల్ సీఈవో క్వింటోస్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఐసీఐసీఐ ఎండీ చందా కొచ్చర్ మాట్లాడుతూ.. మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని నింపినప్పుడే ముందుకు వెళ్లగలమన్నారు. వృద్ధులు, పిల్లలను చూసుకుంటూ మహిళలు ఇంటి నుంచి పనిచేయవచ్చని చెప్పారు.బిడ్డకు జన్మనిచ్చే సమయంలో చాలామంది మహిళలు కెరీర్‌ను వదులుకుంటారన్నారు. బిడ్డకు జన్మనిచ్చే సమయంలో కెరీర్‌ను వదులుకునే ఆలోచన చేయొద్దని మహిళలను ఆమె కోరారు.
సాంకేతికను వినియోగించి ఇంటినుంచి పనిచేసే అవకాశాలు ఇవ్వాలని ఆమె కోరారు. మహిళలు విద్యావంతులైతే ఒక తరం మొత్తం విద్యావంతమైతదన్నారు. నేడు భారత దేశ రక్షణమంత్రిగా మహిళ ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. దేశంలోని బ్యాకింగ్ రంగంలో 40శాతం మంది మహిళలు పనిచేస్తున్నారని చెప్పారు. ఆత్మస్థైర్యం నింపినప్పుడే మహిళలు రాణించగలరని చెప్పారు.