ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)లో భాగంగా బుధవారం మహిళా పారిశ్రామికవేత్తల నైపుణ్యాభివృద్ధి అంశంపై ప్లీనర్ జరిగింది. ఈ చర్చ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ సమన్వయకర్తగా వ్యవహరించగా.. ముఖ్య అతిథి ఇవాంకా ట్రంప్‌తోపాటు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సతీమణి చెర్రీ బ్లెయిర్, ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ చందా కొచ్చార్, డెల్ సీఈవో క్వింటోస్ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరుగుతున్న ఈ ప్లీనరీలో ఇవాంక మాట్లాడుతూ.. మహిళలు విభిన్న రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారని అన్నారు. సాంకేతిక విభాగంలో మహిళా పారిశ్రామివేత్తలకు అవకాశాలు ఉన్నాయన్నారు. మహిళలు ఉద్యోగాలు చేస్తూ ఆర్థికంగా కుటుంబాలకు అండగా ఉంటున్నారని తెలిపారు. నూతన అవకాశాలను అందిపుచ్చుకునేందుకు మహిళలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. నూతన ఆవిష్కరణలన్నీ ప్రైవేటు రంగంలోనే వస్తున్నాయని.. ఏ రంగంలోనైనా సేవలు బాగుంటేనే ఆదరణ ఉంటుందని ఆమె తెలిపారు.