At #DeekshaDiwas Nizamabad pic.twitter.com/JK0RqlYKXQ
— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 29, 2017
దీక్షా దివస్ స్పూర్తితో బంగారు తెలంగాణ సాధిద్దామని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. ముఖ్య మంత్రి కేసీఆర్ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను పణంగా పెట్టి ఆమరణ దీక్ష చేపట్టిన నవంబర్ 29 ను దీక్షా దివస్‌గా జరుపుకుంటున్నామని తెలిపారు. నిజామాబాద్ కలెక్టరేట్ గ్రౌండ్‌లో దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ ఘనంగా నిర్వహించింది. వందలాది మంది దీక్షలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఉన్నారు. వారికి మద్ధతుగా బీసీ సంఘం నేతలు, టీఆర్ఎస్వీ. టీఆర్ఎస్‌కేవీ, తెలంగాణ అడ్వకేట్ జేఏసీ, నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ బార్ అసోసియేషన్, ఐఎంఎ డాక్టర్లు, బంజారాలు, జోగినీలు, ప్రెస్ క్లబ్ సభ్యులు, ఆర్టీసి ఉద్యోగులు, వ్యవసాయ మార్కెట్ ఉద్యోగులు, ఆశ, అంగన్ వాడీ , బీడి వర్కర్లు, భవన నిర్మాణ కార్మికులు, ఆటో యూనియన్ నేతలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మిడ్ డే మీల్స్ బాధ్యులు, ఎస్సీ, ఎస్టీ, బిసి కులాల సంఘాల నేతలు దీక్షా దివస్‌లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ రాణి రుద్రమదేవి వారసులైన నిజామాబాద్ అడబిడ్డలకు, కేసీఆర్ అభిమానులకు వందనాలు తెలిపారు. దీక్షా దివస్ సందర్భంగా నాటి ఉద్యమ స్మతులు, త్యాగాలను నెమరువేసుకుంటూ బంగారు తెలంగాణకు బాటలు వేసేందుకు ఉపయోగించుకోవాలని, నాటి కెసిఆర్ త్యాగాన్ని నేటి తరానికి, భవిష్యత్ తరాలకూ స్పూర్తినిచ్చేలా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు ఎంపి కవిత. తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని రెండు భాగాలుగా చూడాలని, 2009లో కెసిఆర్ ఆమరణ దీక్ష చేపట్టడానికి ముందు 2001 నుండి 2008 వరకు, దీక్ష తరవాత నుంచి తెలంగాణ సాధన వరకు ఉద్యమాన్ని చూడాలన్నారు. ప్రజల ఆందోళన ఫలితంగానే కెసిఆర్ చివరి ప్రయత్నంగా దీక్ష చేశారని, ఆ దీక్ష ఫలితంగానే 2009 నవంబర్ 29న తెలంగాణ ప్రకటన వచ్చిందన్నారు. కెసిఆర్ దీక్ష ఎంత ముఖ్యమో…ఆయనకు మద్దతు తెలిపిన వారూ అంతే ముఖ్యం ఆ మద్ధతు ధైర్యంతోనే డిల్లీకి వెళ్లి గళం విప్పారన్నారు.
ఉద్యమంలో అలసిపోయిన సందర్భంలో కెసిఆర్ ముందుకు వచ్చారని దెబ్బతిన్న ప్రాణం కాబట్టే ఉద్యమకారులు కెసిఆర్‌ను నిశితంగా పరిశీలించారు. కెసిఆర్ ఎత్తుగడలు, వ్యూహాలతో ఉద్యమంలో వేగం పెరిగిందని, ఫలితంగా ఉద్యమంలోకి సకలజనులు వచ్చారన్నారు.
కోసిఆర్ శవ యాత్రనో..తెలంగాణ జైత్ర యాత్రనో తేలిపోవాలని కెసిఆర్ అన్నరని కవిత తెలిపారు.
సన్నిహితులు, మిత్రులు దీక్షకు పోవద్దని వారించినా….ఆయన నాకు పిరికి మందు నూరిపోయవద్దని, చేతనైతే నాతో నడవమన్నారని ఆనాటి సంగతులను గుర్తు చేసుకుంటూ వివరించారు. తెలంగాణ సమాజం ఒక వైపు…మరో వైపు కుటుంబం….పగవాడికి కూడా అలాంటి పరిస్థితి రావద్దని కోరుకున్నాం. కెసిఆర్ దీక్ష చేస్తుంటే శ్రీకాంతా చారి ఆత్మబలిదానం చేసుకున్నాడు. మరి కొందరు ఆయన బాటలో పయనిస్తున్నారు. శ్రీకాంతాచారి మరణం చూసి కెసిఆర్ బోరున విలపించారు. టివిలను ఆఫ్ చేయించాం…నాయని నరసింహారెడ్డి, నందిని సిధారెడ్డి లాంటి వారు దైర్యాన్నిచ్చారు అంటూ ఆనాటి ఉద్విగ్న పరిస్థితిని వివరించారు. నవంబర్ 29 తెలంగాణ ప్రకటనకు నాంది అయింది. త్యాగం ఎలాంటి ఫలితం ఇస్తుందో నేటి తరానికి తెలియాల్సి ఉంది. డిసెంబర్ 9న ప్రకటన వచ్చింది. ఆంధ్ర నేతల కుట్రలతో 23న ప్రకటన వాపస్ తీసుకున్నారు…సింగరేణి కార్మికులు సమ్మెకు దిగడం…అన్ని వర్గాలు ఉద్యమంలో పాల్గొన్న విషయం మనకు తెలిసిందే…తెలంగాణ సమాజం ఐక్యంగా ఉంటదని తెలంగాణ అంతటికి తెలియజెప్పే ప్రయత్నం ఈ సందర్భమన్నారు నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత.
తెలంగాణ వస్తే ఏమొస్తది..అంటూ హేళన చేసిన వారికి ఉద్యమ నాయకుడు కేసిఆర్ నేతృత్వంలో టిఆర్ ఎస్ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి చేస్తున్న కృషికి అందరూ మెచ్చుకుంటున్నారని కవిత చెప్పారు. హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి సదస్సు జరుగుతున్నదని ఎన్నో రాష్ట్రాలు అడ్డుకునే ప్రయత్నం చేసినా…తెలంగాణలోనే సదస్సు జరుగుతున్నదని చెప్పారు. గత నాలుగేళ్లలో నాలుగు వేల కోట్లకు పైగా మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం ఖర్చు చేసిందని కవిత తెలిపారు అలాగే ప్రతి నెలా 40 లక్షల మందికి పెన్షన్లు ఇస్తూ 412 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదని, 23 వేల కోట్లతో చెరువులు బాగు చేసుకుంటున్నం. 43 వేల కోట్లతో ఇంటింటికి మంచి నీరిచ్చే ప్రయత్నం చేస్తున్నం.24 గంటలు ఇప్పుడు కరెంటు ఉంటోంది. 94 వేల కోట్ల పెట్టుబడులు పెడుతుండటం వల్లే కరెంటు సమస్య తీరిందన్నారు. వచ్చే జనవరి నుంచి 24 గంటలు కరెంటు సరఫరా జరుగుతుందని కవిత దీక్షా దివస్‌లో పాల్గొన్న వారి హర్షద్వానాల మద్య తెలిపారు. అరవై ఏండ్లలో జరగని అభివృద్ది మనం నాలుగేండ్లలో చేసుకుంటున్నమన్నారు. గోదావరి పుష్కరాలు అంటే రాజమండ్రి, కృష్ణా పుష్కరాలు అంటే విజయవాడ గుర్తుకు తెచ్చే వారని, తెలంగాణ వచ్చాక గోదావరి పుష్కరాలకు హైదరాబాద్ నుంచి ప్రజలు నిజామాబాద్‌కు వచ్చారు. కృష్ణా పుష్కరాలు తెలంగాణలో జరుపుకున్నం. తెలుగు భాషకు సంబంధించి కూడా అవమానాలను ఎదుర్కొన్నామని, సిధారెడ్డి ఆధ్వర్యంలో ఇపుడు హైదరాబాద్‌లో ప్రపంచ తెలుగు మహాసభలు జరుపుకుంటున్నామని కవిత వివరించారు.
తెలంగాణ జాగృతి సాంస్కృతిక విభాగం కన్వీనర్ కోదారి శ్రీను, సాయిచంద్ నేతృత్వంలో జరిగిన ధూం ధాం అలరించింది. అసోయ్ దులా ఆరతి..కాళ్ల గజ్జెల హారతి పాటకు దీక్షా దివస్‌లో పాల్గొన్నవారంతా కోరస్ ఇస్తూ ఉత్సాహంగా ధూం ధాం చేశారు.దీక్షా దివస్‌లో సర్వమత ప్రార్థనలు జరిగాయి. తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, కెసిఆర్ ప్రభుత్వానికి, పార్టీ నాయకులకు దైవ బలం చేకూరాలని ప్రార్థనల సందర్భంగా పూజారులు, పాస్టర్లు, ముస్లిం మత పెద్దలు కోరారు. అనంతరం నాటి ఉద్యమ ఘట్టాలను తెలిపే వార్తా పేపర్ల కథనాలు, ఫోటోల ప్రదర్శనను తిలకించారు. టిఆర్ ఎస్ సీనియర్ నాయకుడు పోశెట్టి, జడ్పీ వైస్ ఛైర్మన్ సుమనారెడ్డి, టిఎన్‌జీఓనిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు కిషన్‌కు ఎంపి కవిత నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ నందిని సిధారెడ్డి, మిషన్ భగీరథ ఛైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్, రూరల్ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీలు భూపతి రెడ్డి, వీజీ గౌడ్, జడ్పీ ఛైర్మన్ దఫేదార్ రాజు, మేయర్ ఆకుల సుజాత, టిఆర్ ఎస్ సీనియర్ నాయకులు రాంకిషన్ రావు, రెడ్ కో ఛైర్మన్ అలీం, టిఆర్ ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ముజీబొద్దీన్, టిఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఈగ గంగారెడ్డి , తెలంగాణ జాగృతి నాయకులు పాల్గొన్నారు.
Tags Deeksha Diwas MP KAVITHA NIZAMABAD