ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో(GES) పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు, కుమార్తె ఇవాంక ట్రంప్ గోల్కొండ కోటను ఇవాళ (బుధవారం) సందర్శించారు. భారీ భద్రత మధ్య మధ్యాహ్నం 3 గంటల సమయంలో గోల్కొండ కోటకు వచ్చిన ఆమె.. 40 నిమిషాలు కోట అంతా తిరిగారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. హైదరాబాద్, గోల్కొండకోట ప్రాధాన్యతను వివరిస్తూ ప్రదర్శించిన డాక్యుమెటరీని చూశారు. రాష్ట్ర చారిత్రక, సాంస్కృతిక విశేషాలను తెలిపే డిజిటల్ ప్రదర్శనను ఇవాంక ఆసక్తిగా గమనించారు. ఈ సందర్భంగా కోట గురించి అధికారులను అడిగి తెలుసుకున్న ఇవాంక.. రాణిమహాల్ను చూశారు. కోట సందర్శన తర్వాత తిరిగి ట్రైడెంట్ హోటల్‌కు వెళ్లిపోయారు.కోట పరిధిలో రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సదస్సుకు వచ్చిన 1500 మంది ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం గోల్కొండ కోటలో ఈ రాత్రి విందు ఇవ్వనుంది.