భాగ్యనగర ప్రజలు ఎప్పుడెప్పుడా.. అని ఎదురుచూస్తున్న మెట్రోరైలు అందుబాటులోకి వచ్చింది.ప్రధాని మోదీ మెట్రో రైలును ప్రారంబించిన విషయం తెలిసిందే..మెట్రో రైలులో ప్రయాణించేందుకు నగర ప్రజలు ఎంతో ఉత్సాహాం చూపుతున్నారు. ఉదయం 6 గంటల నుంచి అందుబాటులోకి వచ్చిన మెట్రో రైళ్లకు ప్రయాణికుల తాకిడి ఎక్కువైపోయింది.
ఈ క్రమంలో ఇప్పుడు అందరి చూపు స్మార్ట్ కార్డులపైనే పడింది. ఈనెల 26 నుంచి స్మార్ట్ కార్డుల విక్రయాలు మొదలైన విషయం తెలిసిందే. మంగళవారం తార్నాక, నాగోల్, ప్రకాశ్‌నగర్, ఎస్‌ఆర్ నగర్, మియాపూర్‌లో స్మార్ట్ కార్డుల కోసం ప్రయాణీకులు బారులు తీరారు. కార్డులు కొనుగోలు చేసిన అనంతరం స్టేషన్ సిబ్బందిని సంప్రదించి కార్డు ఉపయోగాలు తెలుసుకుంటున్నారు.మెట్రో స్మార్ట్ కార్డు ధర రూ.200 ఉండగా అందులో రూ.100 జమ అవుతుంది. మిగిలిన వంద రూపాయలు ప్రయాణానికి వినియోగించుకోవచ్చు. కార్డు పరిమితి ఏడాది. అనంతరం రెన్యూవల్ చేసుకోవచ్చు. ఈ కార్డుతో టికెట్ ధరలో 5శాతం రాయితీ పొందొచ్చని అధికారులు తెలిపారు. స్మార్ట్ కార్డుతో ఇబ్బందులు లేకుండా ప్రయాణించొచ్చు. రద్దీ సమయంలో, సమయం వృథా కాకుండా స్మార్ట్‌కార్డు సర్వీస్ ద్వారా నేరుగా టికెట్‌ను పొంది ప్లాట్‌ఫారానికి చేరుకోవచ్చు.ఇప్పటి వరకు సుమారు 15 వేల స్మార్ట్ కార్డులు విక్రయించినట్టు అధికారులు తెలిపారు.