గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ సందర్భంగా రెండో రోజు సైతం మంత్రి కేటీఆర్ బిజీబిజీగా గడిపారు. ఫేస్‌బుక్ పబ్లిక్ పాలసీ హెడ్ జేంస్ హెయిర్‌స్టన్, బిజినెస్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆష్ జవేరి, పబ్లిక్ పాలసీ డైరెక్టర్ అంఖి దాస్‌లు ఇవ్వాళ ఐటీ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, డేటా అనలటిక్స్ రంగంలో తమ కంపెనీ చేస్తున్న పనిని వారు మంత్రికి వివరించారు. టీ-హబ్ తో కలిసి ఫేస్‌బుక్ సంయుక్తంగా నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల గురించి ఈ సందర్భంగా చర్చ జరిగింది. జీ.ఈ.ఎస్ కాన్ఫరెన్స్ ను అత్యద్భుతంగా నిర్వహిస్తున్నారని ఈ సందర్భంగా ఫేస్‌బుక్ ప్రతినిధులు కితాబునిచ్చారు.
అమెరికా వెలుపల అతి పెద్ద ఆఫీసును ఫేస్‌బుక్ సంస్థ హైదరాబాదులో ఏర్పాటు చేసిందని. వారు భవిష్యత్తులో కొత్త విభాగాలను ఏర్పర్చదల్చుకుంటే అందుకు అన్నివిధాలా సహకరిస్తామని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు
కాగా, అస్ట్రేలియన్ హైకమీషనర్ హరిందర్ సిద్దుతో మంత్రి కెటి రామారావు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ర్టంలో విద్య రంగం, గనులు, యానిమేషన్ గేమింగ్ రంగాల్లో అస్ర్టేలియన్ కంపెనీలకున్న పెట్టుబడుల అవకాశాలను వివరించారు. అస్ర్టేలియా యూనివర్సిటీలకు ఉన్నత చదువులకు వెళ్లే విద్యార్ధుల సంఖ్య పెరుగుతున్నదని, అస్ర్టేలియన్ యూనివర్సీటీల భాగస్వామ్యంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న గేమింగ్ టవర్ , ఈ రంగంలో ఉన్న పెట్టుబడుల అవకాశాలను వివరించారు.