మనం చూశాం ఎక్కడైన పోలీసులు పేకాట ఆడే వారిని అరెస్టు చేసి జైలుకు పంపుతుంటారు. కానీ, తిరుపతిలో కొందరు పోలీసులే పేకాట ఆడుతూ స్పెషల్‌బ్రాంచ్ పోలీసులకు దొరికిపోయారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి సోమవారం ఈస్ట్ పోలీసులు తెలిపిన మేరకు.. శ్రీగోవిందరాజస్వామి ఆలయం సమీపంలోని ఓ లాడ్జిలో కొందరు పేకాట ఆడుతున్నట్లు స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు సమాచారం అందింది.దీంతో ఎస్‌బీ ఎస్‌ఐ సూర్యనారాయణ తన సిబ్బందితో కలిసి లాడ్జిపై దాడి చేశారు. పేకాట ఆడుతున్న ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ నారాయణమూర్తి, ఈస్ట్ కానిస్టేబుల్ చెంగప్ప, రిటైర్డ్ ఎస్‌ఐ జ్ఞానశేఖర్, టీటీడీ పరిపాలనా భవనం ఉద్యోగి చంద్రానాయక్, లాడ్జి మేనేజర్ ధర్మయ్య, వెంకటరమణారెడ్డిని అదుపులోకి తీసుకుని ఈస్ట్ పోలీసులకు అప్పగించారు. వీరిపై కేసు నమోదుచేసి రిమాండుకు పంపించారు.
పోలీసులు పేకాట ఆడటంపై అర్బన్‌ఎస్పీ అభిషేక్ మహంతి సీరియస్ అయినట్లు సమాచారం. ప్రస్తుతం సెలవులో ఉన్న ఆయన మంగళవారం విధులకు హాజరుకానున్నారు. ఆ తర్వాత జూదానికి పాల్పడ్డ పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది.
