ఆంధ్రప్రదేశ్‌కు అభివృద్ధిని పరిచయం చేసిందే మేము అంటూ చెప్పుకు తిరిగే ముఖ్యమంత్రి చంద్రబాబు.. మాటల మరాఠీయేనని మరోసారి రుజువైంది. 2014 ఎన్నికల్లో అభివృద్ధికి మరిన్ని మెరుగులు దిద్దుతామని, అప్పుడే ఓటు నమోదు చేసుకున్న ఓటరు నుంచి కురువృద్ధుల అవసరాలను ఆసరాగా చేసుకుని అమలు కాని హామీలను గుప్పించి.. గద్దెనెక్కిన చంద్రబాబు.. అధికారపీటమెక్కిన వెంటనే తన వక్రబుద్ధిని చూపించారు. ఇందుకు నిదర్శనంగా రాష్ట్రవ్యాప్తంగా కుంటుపడిన అభివృద్ధే.
మంత్రి పుల్లారెడ్డి ఇలాఖాలో అయితే మరీను.. ఇందుకు కారణం మంత్రి పుల్లారావు కుటుంబ సభ్యులే. చిలకలూరి పేట నియోజకవర్గంలో మంత్రి పుల్లారావు కుటుంబ సభ్యుల జోక్యం పెరిగిందా..? ఆ జోక్యాన్ని ప్రజలు నెగిటివ్‌గా రిసీవ్ చేసుకుంటున్నారా…? మంత్రి పుల్లారావు పనితీరే 2019 ఎన్నికల్లో ఓటమికి కారణం కాబోతుందా..? అన్న ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నారు చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలు.
ఇప్పటికే నియోజకవర్గంలో కుంటుపడిన అభివృద్ధి, ప్రజలపై మంత్రి కుటుంబ సభ్యుల పెత్తనం, అధికారిక వ్యవహారాల్లో మంత్రి భార్య జోక్యం, సమస్యలను పరిష్కరించే సత్తా లేకపోవడం వంటి కారణాలే ఇందుకు నిదర్శనం. అయితే, పరిపాలనలో కుటుంబ జోక్యంపై మంత్రి స్పందిస్తూ.. నేను అందుబాటులో లేనప్పుడు సమస్యలు తెలుసుకోవడంలో తప్పేముందని అంటున్నారు?
నియోజకవర్గంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. ఏ సమస్యను కూడా ఇంత వరకు పూర్తి చేసినటువంటి దాఖలాలు లేవు. నియోజకవర్గంలో ప్రధానమైన ఇళ్ల స్థలాల సమస్య ఇప్పటి వరకు పరిష్కారానికి నోచుకోలేదు. దీంతో చిలకలూరిపేట నియోజకవర్గంలో వేల సంఖ్యలో ఉన్న నిరుపేదలు చంద్రబాబు సర్కార్‌పై పెదవి విరుస్తున్నారు.
ఇక తాగునీటి విషయానికొస్తే అవసరాలు తీర్చడానికి వంద ఎకరాల చెరువు ఉన్నా ఉపయోగంలోకి తెచ్చే విషయంలో ప్రభుత్వం విఫలమైంది. మూడేళ్ల నుంచి మొత్తుకుంటున్నా.. కనీసం మంచినీళ్లు ఇవ్వలేకపోతున్నారని మంత్రి పత్తిపాటిపై విమర్శలు గుప్పిస్తున్నారు స్థానికులు. నీళ్ల ట్యాంకర్స్ యజమానులు టీడీపీ వారికే చెందినవి కావడంతో సామాన్యులకు సక్రమంగా తాగునీటి సరఫరా చేయడం లేదని, నీళ్లు సరఫరా చేసినా… చేయకపోయినా వారికి అందే నగదు అందుతుందన్న ధీమాతో.. మాకు నీరు సరఫరా చేయడం లేదని వాపోతున్నారు సామాన్యులు.
ఇక డ్రైనేజీ వ్యవస్థదీ అదే తీరు. డ్రైనేజీ నిర్వహణ సరిగా లేకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో ముక్కులు మూసుకుని నడవాల్సిన దుస్థితి. మంత్రి స్థానికంగా నివాసం ఉంటున్నా ఇదేం గతి అంటున్నారు స్థానికులు.
కరెంటు స్తంభాలు అధ్వాన్న స్థితిలో ఉన్నాయి. ఎప్పుడు కూలి మీదపడతాయో తెలీదు. కరెంటు తీగలు కిందిదాకా వేలాడుతున్నాయి. కనీసం నియోజకవర్గ కేంద్రంలో పూర్తిస్థాయిలో వీధిలైట్లు కూడా వెలగడం లేదని, ఈ దౌర్బాగ్యం ఏంటని మంత్రి పత్తిపాటి పుల్లారావుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలు.
అయితే, చిలకలూరిపేట నియోజకవర్గం అభివృద్ధి కోసం రూ. 1,770 కోట్లు ఖర్చు చేశామని చెప్పుకునే మంత్రి పత్తిపాటి పుల్లారావు.. అభివృద్ధిపై ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకు మరెన్ని మాయమాటలు చెబుతారో చూడాలి.