బిత్తిరి సత్తి.. ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. అంతలా పాపులారిటీ తెచ్చుకున్నాడు బిత్తిరి సత్తి. ఓ ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అయ్యే తీన్‌మార్ షోలో యాంకర్ సావిత్రితో కలిసి బిత్తిరి సత్తి చేసే హడావుడి అంతా ఇంతా కాదు. అక్కా అంటూ సావిత్రిని ఉద్దేశించి బిత్తిరి సత్తి పలికే సంభాషణలు నవ్వులు తెప్పిస్తాయన్నది తెలిసిన విషయమే. అంతేకాదు బిత్తిరి సత్తి ప్రస్తుతం టీవీ షోలతోనే కాకుండా అడపా దడపా సినిమాల్లో కూడా నటిస్తున్నాడు.
అయితే, బిత్తిరి సత్తి అలియాస్ కావలి రవికుమార్ పై సికింద్రాబాద్‌కు చెందిన మణికంఠ అనే వ్యక్తి నిన్న దాడి చేసిన విషయం తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం ఆఫీసుకు వెళ్లిన సత్తి, కార్యాలయానికి సమీపించిన సమయంలో మణికంఠ హెల్మెట్ తో సత్తిపై దాడి చేశాడు. అనంతరం తీవ్రంగా గాయపడ్డ బిత్తిరి సత్తిని స్థానికులు బంజారాహిల్స్ లోని స్టార్ ఆసుపత్రికి తరలించారు.
అయితే, ఇప్పటికే బిత్తిరి సత్తిపై దాడికి పాల్పడిన పోలీసులు విచారించగా.. తెలంగాణ భాషను అవమాన పరుస్తూ కార్యక్రమం చేయడంతోనే తాను దాడికి పాల్పడ్డానని, బిత్తిరి సత్తి భాష, వేషదారణ, నటన తెలంగాణ వాసులను అవమాన పరిచేలా ఉందని మణికంఠ పోలీసుల విచారణలో వెల్లడించాడు. అలాగే, బిత్తిరి సత్తితో కలిసి షో నిర్వహిస్తున్న యాంకర్ సావిత్రిపై కూడా దాడి చేస్తానని మద్యం మత్తులో ఉన్న నిందితుడు మణికంఠ పోలీసుల ఎదుట చెప్పడం గమనార్హం.