తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఈ నెల 28 నుండి జరగనున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు సన్నాహక సమావేశంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు చేసిన ప్రసంగానికి నోబెల్ అవార్డు గ్రహీత కైలాశ్ సత్యార్థి ఫిదా అయిపోయారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతుంటే.. సాంకేతిక వృత్తి నిపుణుడు మాట్లాడుతున్నట్టుగా ఉన్నదని ప్రశంసల జల్లు కురిపించారు.
ఆదివారం నీతి ఆయోగ్ ఆధ్యర్యంలో హెచ్ఐసీసీలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో సరిగ్గా మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తున్న సమయంలోనే కైలాశ్ సత్యార్థి హాలులోకి ప్రవేశించారు. కేటీఆర్ ప్రసంగాన్ని ఆసాంతం శ్రద్ధగా విన్న సత్యార్థి ప్రశంసలతో ముంచెత్తారు. ఆవిష్కరణలు, ఐడియాల గురించి మంత్రి కేటీఆర్ మాట్లాడుతుంటే.. చాలా శ్రద్ధగా విన్నాను. కండ్లు మూసుకొని ఒక్కసారి ఆలోచిస్తే.. ఆయన మంత్రి అని అనిపించలేదు. ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. నేను లోపలికి వస్తుంటే.. కేటీఆర్ అప్పుడే తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అప్పుడు ఆయన్ను చూసి లాస్ఎంజెల్స్ నుంచో లేక స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ నుంచో వచ్చిన సాంకేతిక వృత్తి నిపుణుడు అయి ఉంటారని అనిపించింది. భారతఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసేందుకు ప్రజల నుంచి సరికొత్త ఐడియాలు కోరుతున్నారని అనుకొన్నాను. అందుకోసం మనమంతా ఒక్కసారి ఖచ్చితంగా కేటీఆర్కు చప్పట్లతో అభినందనలు తెలుపాలి. వృత్తినైపుణ్యం, జ్ఞానం, ముక్కుసూటితనం కలిసి ఉన్న వ్యక్తి కేటీఆర్ అని కైలాశ్ సత్యార్థి కొనియాడారు. వృత్తినైపుణ్యం, జ్ఞానం కలిసి ఉండటం అరుదైన అంశమని, ఈ విషయంలో ప్రత్యేకంగా కేటీఆర్కు అభినందనలు తెలుపాల్సిందేనని అన్నారు.