హైదరాబాద్ మెట్రో ప్రారంభోత్సవానికి అంతా సిద్ధమైనట్లు ఐటి, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీఆర్ ఇవాళ ట్వీట్ చేశారు. ఓ హైదరాబాదీ తరహాలో తాను కూడా ఈ క్షణం కోసం ఆత్రుతగా ఉన్నట్లు కేటీఆర్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. రేపు మధ్యాహ్నం హైదరాబాద్ మెట్రో రైలుని ప్రధానమంత్రి నరేంద్ర మోడి ప్రారంభిస్తారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎల్లుండి నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. ప్రధాని మెట్రో రైలుని ప్రారంభించనున్న మియాపూర్ డిపో, స్టేషన్ల దగ్గర ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. ఆ తర్వాత మీడియాతో మంత్రి మాట్లాడుతూ…
ప్రధాని మోడి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్టుకు మధ్యాహ్నం 1.10 గంటలకు చేరుకుంటారని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. 1.45 కు ప్రత్యేక హెలికాఫ్టర్ లో మియాపూర్ మెట్రో డిపోకు చేరుకుంటారని తెలిపారు. అక్కడ ముందుగా మెట్రో రైలు పైలాన్ ఆవిష్కరిస్తారని, మెట్రో స్టేషన్ లోపల ఆడియో, వీడియో ప్రజెంటేషన్ చూస్తారని చెప్పారు. ఆ తర్వాత మియాపూర్ నుంచి కూకట్ పల్లి వరకు 5 కిలోమీటర్లు ప్రధాని మెట్రోరైలులో ప్రయాణిస్తారని, తిరిగి మియాపూర్ వస్తారని వివరించారు. అక్కడి నుంచి గ్లోబల్ ఆంట్రప్రెన్యూర్ షిప్ సమ్మిట్ జరిగే హెచ్ఐసిసికి హెలికాప్టర్ లో వెళ్తారని తెలిపారు.ప్రధాని రాక సందర్భంగా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ సూచనల మేరకు భద్రత కఠినతరం చేశారని మంత్రి కేటీఆర్ చెప్పారు. మెట్రో ప్రారంభోత్సవానికి మీడియాకు అనుమతి ఉండదన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడతారని సమాచారం లేదన్నారు. మెట్రో ప్రాజెక్ట్ మొత్తం పూర్తయితే రోజుకు 15 నుంచి 17 లక్షల మందిని ట్రాన్స్ పోర్ట్ చేస్తుందన్నారు.
All set for Hyderabad Metro ? Launch. I am as excited as any other fellow Hyderabadi
Reviewed all arrangements for tomorrow’s inauguration by Hon’ble PM pic.twitter.com/EMvvW3UfxY
— KTR (@KTRTRS) November 27, 2017