ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేటలో రైతులకు గేదెలు, రూపే కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబుల చేతుల మీదుగా లబ్ధిదారులకు గేదెలు అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ఈ రోజు 160 మంది రైతులకు 9.60కోట్ల విలువ గల గేదెలను పంపిణీ చేశామని తెలిపారు. రాష్ట్రంలో రైతులు పండించిన పత్తి మద్దతు ధర కోసం 150 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అప్పులు ఉబిలో కూరుకపోయిన రైతును రాజు చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని, అందుకుగాను వచ్చే ఖరీఫ్ నుంచి ఎకరానికి సంవత్సరానికి రూ.8వేల ఉచిత పెట్టుబడి అందిస్తున్నట్లు మంత్రి తుమ్మల పేర్కొన్నారు .సంక్రాంతి పండుగ వరకు పాలేరు నియోజకవర్గాన్ని ఓడీఎఫ్‌గా ప్రకటించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు.
ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలోనే రైతులకు అన్ని రకాల రుణాలు అందించడంలో ఖమ్మం డీసీసీబీ అగ్రస్థానంలో ఉందన్నారు. కార్పొరేట్ బ్యాంకులకు దీటుగా సహకార వ్యవస్థ పనిచేస్తుందని, ఎటువంటి ష్యూరిటీ లేకుండా రైతులకు రుణాలు ఇస్తున్న ఘనత డీసీసీబీదే అన్నారు.