ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత పద్దెనిమిది రోజులుగా ప్రజాసంకల్ప పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి విదితమే .జగన్ చేస్తున్న పాదయాత్రకు పలు వర్గాల నుండి అశేష ఆదరణ లభిస్తుంది .ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వైజాగ్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఒకరు వైసీపీలో చేరడానికి సిద్ధమయ్యారు అని వార్తలు వస్తోన్నాయి .
అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాలో పాడేరు అసెంబ్లీ నియోజక వర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ,అప్పటి ఉమ్మడి ఏపీ చిట్టచివరి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హాయంలో గిరిజన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు త్వరలోనే వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు అని వార్తలు జిల్లా రాజకీయాల్లో చక్కర్లు కొడుతున్నాయి .
రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏపీలో పూర్తిగా కనుమరుగు అవ్వడంతో ఆ పార్టీకి చెందిన నేతలు ఇటు టీడీపీ అటు వైసీపీ పార్టీలోకి చేరారు .తాజాగా మాజీ మంత్రి బాలరాజు చేరికకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని సమాచారం .అయితే ఇప్పటికే పాడేరు అసెంబ్లీ నియోజక వర్గ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఈశ్వరి టీడీపీలో చేరబోతున్నారు అని కూడా యెల్లో మీడియా ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది .