సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని కొండపోచమ్మ దేవాలయం పాలకమండలి ప్రమాణస్వీకారానికి ముఖ్య అతిధిగా ఆదివారం మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పకడ్బందీ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నారని చెప్పారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రాజెక్టులు నిర్మించి తీరుతామని మంత్రి స్పష్టం చేశారు.కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేస్తే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందన్నారు. సిద్దిపేట జిల్లాలో మూడు రిజర్వాయర్లను పూర్తి చేసి, ప్రతిరోజు ఒక్క టీఎంసీ చొప్పున నీరు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణ కోసం కేసీఆర్ ప్రాణాలను సైతం లెక్క చేయలేదని.. అదే మొండిపట్టుతో అభివృద్ధి కూడా చేస్తున్నారని చెప్పారు. కేసీఆర్ దైవభక్తుడని, రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. కొండపోచమ్మ ఆయలం దశదిశా మారుతోందని, టూరిజం ఏర్పాటుకు కృషి చేస్తానని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు