రాష్ట్రంలోని అన్నివర్గాల అభివృద్ధే లక్ష్యంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని హైదర్‌సాయిపేట శివారు రావిచెట్టుతండ వద్ద ఆకేరుపై రూ.14.10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న చెక్‌డ్యాం, బ్రిడ్జి నిర్మాణానికి ఇవాళ ఆయన శంకుస్థాపన చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ … ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభివృద్ధే లక్ష్యంగా అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తుందని అన్నారు. ప్రముఖంగా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి అధిక నిధులు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలో భూగర్భ జలాలను పెంపొందించే లక్ష్యంతో వాగులు, ఏరులపై చెక్‌డ్యాం, బ్రిడ్జీలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగానే ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం మండలాల్లో ఆకేరుపై ఐదు ప్రాంతాల్లో చెక్‌డ్యామ్‌లు, బ్రిడ్జీల నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇవి పూర్తయితే ఖమ్మం, మహబుబాబాద్ జిల్లాల సరిహద్దు గ్రామాలకు రహదారి సౌకర్యాలతో పాటు సాగునీటి వసతి మెరుగుపడుతుందని తెలిపారు. రోడ్లు, బ్రిడ్జీల నిర్మాణాల వల్ల నష్టపోతున్న రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, ఎంపీపీ కొప్పుల అశోక్, జడ్పీటీసీ బానోత్ విజయ, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు రామసహాయం నరేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.