Home / NATIONAL / ఇవాంకా గురించి ఈ సీక్రెట్ ఇన్ఫో మీకు తెలుసా?

ఇవాంకా గురించి ఈ సీక్రెట్ ఇన్ఫో మీకు తెలుసా?

ఇవాంకా ట్రంప్. కొన్ని నెల‌ల కింద‌టి వర‌కు హైద‌రాబాదీల‌లో కొంద‌రికే తెలిసిన పేరు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌ కూతురుగా అమె ప‌రిచితురాలు. ఈ నెలాఖరున హైదరాబాద్ లో జరిగే గ్లోబల్ ఇంట్రప్రెన్యూర్ షిప్ సదస్సుకు ఇవాంకా వస్తున్న నేపథ్యంలో ఆమె పేరు మీడియాలో మారుమోగిపోతోంది. ఈ నేప‌థ్యంలో ఇవాంకా గురించి కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు.
ఇవాంకా కేవ‌లం ట్రంప్ కూతురే కాదు…అమెరికా అధ్యక్షుడి అడ్వైజర్ కూడా. 1970వ దశకంలో పాపులర్‌ మోడల్‌ అయిన ఇవానా మ్యారీ, ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ముగ్గురు సంతానంలో ఒకరు ఇవాంకా. 1981 అక్టోబర్‌ 30న పుట్టిన ఇవాంకాకు పదేళ్ల వయసున్నప్పుడు తల్లిదండ్రులు విడిపోయారు. దీంతో ఇవాంకాను ఇద్దరు సోదరులతో కలిసి మన్‌ హట్టన్‌లోని బోర్డింగ్‌ స్కూల్‌ కు పంపింది తల్లి.

ఇవాంకా ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు తల్లి బాటలో నడుస్తూ మోడలింగ్‌పై ఆసక్తి పెంచుకుంది. టీనేజ్‌లోనే సెవెంటీస్‌ అనే మ్యాగజైన్‌ కవర్‌ పేజీ కోసం ఫోజులిచ్చింది. చదువుకు ఏ మాత్రం ఆటంకం కలుగకుండా వీకెండ్స్‌ లో టామీ హిల్‌ ఫిగర్‌ లాంటి ప్రసిద్ధ జీన్స్‌ కంపెనీలకు మోడల్‌గానూ పనిచేసింది. మోస్ట్‌ పాపులర్‌ మోడల్‌, యాక్టర్‌ అయిన పారిస్‌ హిల్టన్‌ ఇవాంకాకు చిన్ననాటి స్నేహితురాలు. హిల్టన్‌తో పోటీపడి మరీ ఇవాంకా యాడ్స్‌ లో నటించేది. ప్రెసిడెన్షియల్‌ ఎలక్షన్స్‌ లో డొనాల్డ్‌ ట్రంప్‌పై పోటీచేసి ఓడిన హిల్లరీ క్లింటన్‌ కూతురు
చెల్సియా క్లింటన్‌ కూడా ఇవాంకా బెస్ట్‌ ఫ్రెండ్‌.

ఇవాంకా తల్లి ఇవానాకు జీవితం విలువ బాగా తెలుసు. అందుకే చిన్నప్పటి నుంచే పిల్లలకు డబ్బు విలువ తెలిసేలా పెంచింది. దీంతో ఇవాంకా చిన్నతనం నుంచే కష్టపడేతత్వం అలవర్చుకుంది. తన ఖర్చుల కోసం తల్లిదండ్రులను డబ్బు అడగకుండా టీనేజ్‌ నుంచే మోడలింగ్‌ చేస్తూ సంపాదించుకోవడం అలవాటు చేసుకుంది. ఆ అలవాటే భవిష్యత్తులో ఇవాంకాను తిరుగులేని బిజినెస్‌ ఉమెన్‌గా తీర్చిదిద్దింది.

ఇవాంకాలో చురుకుదనం, తెలివితేటలపై తండ్రి డొనాల్డ్‌ ట్రంప్‌కు అపార నమ్మకం. అందుకే మిగతా పిల్లల కన్నా ఆమెను ఎక్కువగా అభిమానించేవాడు. ఇవాంకాకు కూడా తండ్రి దగ్గర చనువు ఎక్కువే ఉండేది. మోడలింగ్‌లో బిజీగా ఉన్నా అప్పుడప్పుడూ తండ్రి వ్యాపారాల విషయాలు తెలుసుకునేందుకు ఆమె ఆసక్తి చూపేది. బిజినెస్‌కు సంబంధించిన అంశాలను తండ్రిని అడిగి తెలుసుకోవడమే కాక అప్పుడప్పుడూ కొన్ని సలహాలు కూడా ఇచ్చేది. వోగ్‌ లాంటి ప్రసిద్ధ మ్యాగజైన్ కవర్‌ పేజీలపై మోడల్‌గా సత్తా చాటిన ఇవాంకా, మోడలింగ్‌ రంగంలోనే స్థిరపడుతుందని అందరూ అనుకున్నారు. అయితే ఆమె మాత్రం అందరికీ ఊహించని షాక్‌ ఇచ్చింది. రూటు మార్చి రియల్‌ ఎస్టేట్‌ రంగంలో అడుగుపెట్టింది.

యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా నుంచి ఎకనామిక్స్‌ లో బ్యాచిలర్‌ డిగ్రీ పొందిన ఇవాంకా రియల్‌ ఎస్టేట్‌ మ్యాగ్నెట్‌ బ్రూస్‌ రాట్నర్‌ దగ్గర పనిలో చేరింది. ఈ విషయం తెలిసి డొనాల్డ్‌ ట్రంప్‌ కూతురు తెలివికి సంతోషించారు. ఏడాది గడిచాక ఓ రోజు ట్రంప్‌కు ఫోన్‌ చేసిన బ్రూస్‌ ఇవాంకాను పర్మినెంట్‌గా తన కంపెనీలోనే పెట్టుకుంటానని అడిగారట. ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించిన ట్రంప్ 2005లో కూతురికి ట్రంప్‌ ఆర్గనైజేషన్‌లో రియలెస్టేట్‌ బాధ్యతలు అప్పజెప్పారు. అప్పటికి రియల్‌ఎస్టేట్‌ రంగంలో పురుషులదే ఆధిపత్యం. ఇవాంకా రాకతో చాలా మంది ఆమెను హేళన చేశారు. అయితే బ్రూస్‌ దగ్గర పనిచేసిన అనుభవం, తండ్రి నుంచి నేర్చుకున్న కిటుకులతో ప్రత్యర్థుల ఎత్తుకు పైఎత్తులు వేస్తూ తొందరలోనే అందరి నోళ్లు మూయించింది. రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌లో రాటుదేలింది.

బాబ్డ్‌ హెయిర్‌ కట్‌తో సూట్‌ వేసుకుని మీటింగులకు హజరయ్యే ఇవాంకా ఆత్మవిశ్వాసాన్ని చూసి బోర్డ్‌ మెంబర్స్‌ ఆశ్చర్యపోయేవారు. ఇవాంకా నిర్ణయాలు కూడా కచ్చితంగా ఉండేవి. ప్రాపర్టీ కొనాలన్నా, అమ్మాలన్నా ఆమె తర్వాతే ఎవరైనా. ఒక్కోసారి ఇవాంకా తీసుకునే నిర్ణయాలు రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌లో అపార అనుభవమున్న ట్రంప్‌ ను కూడా ఆశ్చర్యపరిచేవి. ఆ నమ్మకంతోనే నిర్ణయాలు తీసుకునే విషయంలో ఆమెకు కావాల్సినంత స్వేచ్ఛ నిచ్చాడు ట్రంప్‌.

అతికొద్ది కాలంలోనే న్యూయార్క్‌ రియల్‌ ఎస్టేట్‌ సెక్టార్‌లో పాపులర్‌ అయిన ఇవాంకాకు 2005లో జరేడ్‌ కుష్నర్‌ పరిచయమయ్యాడు. ఆయన కుష్నర్‌ కంపెనీస్‌ అనే రియల్‌ ఎస్టేట్‌ సంస్థ అధినేత. న్యూయార్క్‌ అబ్జర్వర్‌ మ్యాగజైన్‌ పబ్లిషర్‌ కూడా. జరేడ్‌ తో మూడేళ్ల పాటు సహజీవనం చేసిన ఇవాంకా 2009లో పెళ్లి చేసుకుంది. ఇద్దరిదీ ఒకే ఫీల్డ్‌ కావడంతో వారిద్దరి మధ్య మంచి అండర్‌స్టాండింగ్‌ ఉండేది. వ్యాపారంలో ఒకరితో ఒకరు పోటీపడినా ఇంటికి రాగానే సగటు భార్యభర్తల్లా ఉండేవారు. ఎంత బిజీగా ఉన్నా ఇప్పటికీ తమ ముగ్గురి పిల్లల బాగోగుల్ని ఇవాంకా స్వయంగా చూసుకుంటారు.

ఇవాంకా బిజినెస్‌ ఉమెనే కాదు… ఆర్టిస్ట్‌ కూడా. టీవీ ఆర్టిస్ట్‌ గా ఆమె అమెరికా ప్రజలకు సుపరిచితురాలు. డొనాల్డ్‌ ట్రంప్‌ షో- ది అప్రెంటీస్‌లో ఇవాంకా బోర్డ్‌ రూమ్‌ జడ్జిగా కనిపించారు. బోర్న్‌ రిచ్‌ అనే డాక్యుమెంటరీతో పాటు మరికొన్ని కార్యక్రమాల్లోనూ పాలుపంచుకున్నారు. ఇవాంకాకు లిటరేచర్‌ అంటే ఇష్టం. బుక్స్‌ చదవడమే కాదు.. రాస్తుంది కూడా. పనిలో, జీవితంలో గెలుపు సాధించేందుకు ఏం చేయాలో వివరిస్తూ ఆమె రాసిన తొలిపుస్తకం ది ట్రంప్‌ కార్డ్‌ హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయింది. ఇక రెండో బుక్‌ విమెన్‌ హూ వర్క్‌ సైతం అమ్మకాల్లో రికార్డు సృష్టించింది.

ఇక తండ్రి పొలిటికల్‌ ఎంట్రీలో ఇవాంకా పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. క్యాంపెయినింగ్‌ టీం మెంబర్‌గా రేయింబవళ్లు ఎంతో కష్టపడి ట్రంప్‌ విజయంలో కీలకంగా మారారు. 2017 మార్చిలో ప్రెసిడెంట్‌ అడ్వైజర్‌గా బాధ్యతలు చేపట్టిన ఇవాంకా.ఒక్కపైసా జీతం తీసుకోకుండానే పనిచేస్తున్నారు.
ఇవాంకాకు స్కైయింగ్‌, గోల్ఫ్‌ లో ప్రావీణ్యం ఉంది. సోషల్‌ నెట్‌వర్క్‌ సైట్లలో యాక్టివ్‌గా ఉండే ఆమెకు ట్విట్టర్‌లో 15లక్షల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు.

తన పిల్లలు అరబెల్లా, జోసెఫ్‌, థియోడోర్‌ల ఫొటోలను తరుచూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తుంటారు. ఎంత బిజీగా ఉన్నా ఇవాంకా వీకెండ్‌లను మాత్రం ఫ్యామిలీకే కేటాయిస్తారు. మోడల్‌గా, ఆర్టిస్ట్‌గా, రైటర్‌గా, బిజినెస్‌ ఉమెన్‌గా, ప్రెసిడెంట్‌ అడ్వైజర్‌గా, ముగ్గురు పిల్లల తల్లిగా ఇలా ఏ బాధ్యత చేపట్టినా సమర్థంగా నిర్వహించడంలో ఎన్నడూ వెనకడుగు వేయలేదు. తల్లి చెప్పిన మాటను, తండ్రి నుంచి నేర్చుకున్న విజయ సూత్రాలను మర్చిపోలేదు. అపర కుబేరుల కుటుంబం కూర్చొని తిన్నా తరగని ఆస్తి కోరుకున్నది క్షణాల్లో ముందుండే ప‌రిస్థితులు ఉన్న‌ప్ప‌టికీ…ఏదో సాధించాలన్న తపన ఆమెను ఉన్నత శిఖరాలకు చేర్చిందని విశ్లేష‌కులు అంటున్నారు. (సోషల్ మీడియాలో వైరల్ పోస్టు )

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat