బాలీవుడ్ మూవీ పద్మావతి వివాదం రోజు రోజుకు ముదురుతుంది. కొద్దికాలం క్రితం వరకు ఈ తరహా నిరసనలు రాజస్థాన్‌లో మాత్రమే ఉండగా..ప్రస్తుతం ఆ ఒక్క ప్రాంతానికే పరిమితం కాకుండా పక్క ప్రాంతాలలోను వివాదాలకు ఆధ్యంగా మారుతోంది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి బీజేపీ ఎంపీ చింతామణి మాలవ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. సినిమా కుటుంబాల్లో ఉండే ఆడవాళ్లు రోజుకో భర్తను మారుస్తారని, అలాంటి వాళ్లకు తన గౌరవాన్ని కాపాడుకోవడం కోసం ఆత్మబలిదానం చేసుకున్నవారి గురించి ఏం తెలుస్తుందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై నిన్న సాయంత్రం ఓ ఛానెల్ డిబేట్ నిర్వహించగా బీజేపీ ఎమ్మేల్మే రాజా సింగ్ .. చింతామణి వ్యాఖ్యలని సమర్ధిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
ఆ వివాదం ఇప్పుడు మలుపు తిరిగింది. సదరు టీవీ ఛానల్ లైవ్‌లోనే…సినీ ప్రముఖుడు తమ్మారెడ్డి భరద్వాజ, విమర్శకుడు కత్తి మహేష్ వంటి వారు వెంటనే స్పందించి ఆయనకి తగిన కౌంటర్ ఇచ్చారు. దీనికి కొనసాగింపుగా…మహేష్ బావ , ప్రముఖ టాలీవుడ్ హీరో సుధీర్ బాబు ఘాటుగా స్పందించారు. తన ట్విట్టర్ ఖాతాలో ఓల్డ్‌సిటీకి చెందిన ఎమ్మెల్యే రాజా సింగ్‌పై విరుచుకుపడ్డారు. “ రాజాసింగ్.. నిన్ను చూసి సిగ్గుపడుతున్నా, మహిళలంటే నీకున్న అభిప్రాయం ఇదా? నీ ఇంట్లోని ఆడవాళ్లే నీపై ఉమ్మేయాలి` అని ఘాటుగా స్పందించాడు.
కాగా, రాజస్థాన్‌లో పద్మావతిని దేవతలా పూజిస్తారని, కాని దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ పూర్తిగా చరిత్రను వక్రీకరిస్తూ సినిమాను తీశారని రాజాసింగ్ ఆరోపించారు. సంజయ్ లీలా గతంలో కూడా రామ్‌లీలా, బాజీరావు మస్తాని చిత్రాలను నిర్మించాడని, అందులో కూడా చరిత్రకు విరుద్దంగా సన్నివేశాలను జోడించాడని రాజాసింగ్ ఆరోపించారు. ఈ చిత్రానికి కాంగ్రెస్ నేత శశీథరూర్ మద్దతుగా నిలుస్తున్నాడని, అతనికి దమ్ముంటే సోనియా గాంధీ లవ్ స్టోరీ, ఆమె ప్రేమ చరిత్రను తెరకిక్కించాలని, అప్పుడు తాము ఉచితంగా ప్రచారం చేస్తామన్నారు. ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలని కోరుతున్న తమకు కరాచీ, దుబాయిల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, సంజయ్ లీలా బన్సాలీ వెనుక పాక్ దేశం హస్తం ఉన్నట్లు అనుమానం కలుగుతోందని రాజాసింగ్ అన్నారు.