జగన్ పాదయాత్ర కర్నూల్లో విజయవంతంగా సాగుతోంది. ఇప్పటికే అక్కడ జరిగిన చిన్నపాటి సభల్లో ఏపీ ప్రజల పై వరాల జల్లు కురిపించిన జగన్ మరోవైపు చంద్రబాబు సర్కార్ పాలన పై మాటల తూటాలు పేలుస్తున్నారు. ఇక బేతంచర్లలో అయితే జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.
బేతంచర్లలో జగన్ ప్రసంగిస్తూ.. ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో టీడీపీ నేతలు ఎన్నో దారుణాలు, మోసాలు చేశారని.. అబద్ధాలు చెప్తున్న వ్యక్తే ముఖ్యమంత్రి స్థానంలో ఉండడం.. ఇలాంటి వ్యక్తిని మళ్లీ పొరపాటున కూడా ఎన్నుకోవద్దని, ఒకవేళ ఎన్నుకుంటే విశ్వసనీయత అనే పదానికి అర్థం, రాజకీయ వ్యవస్థకు విలువ ఉండవని జగన్ అన్నారు.
ప్రస్తుత రాజకీయ వ్యవస్థ మారాలని.. ఈ వ్యవస్థ మారకపోతే అవహేళనకు గురవుతుంది. పదవుల కోసం అడ్డగోలుగా హామీలు ఇచ్చి.. ప్రజలను ఇలాగే మోసం చేస్తూ ఉంటారని.. ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చిన చంద్రబాబు తన నాలుగేళ్ల పాలనలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని.. చంద్రబాబు లాంటి వ్యక్తిని పొరపాటున కూడా ఎన్నుకోకూడదని జగన్ ఫైర్ అయ్యారు.