తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు తమ స్వార్ధ రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ నేతలు గిరిజనుల మధ్య చిచ్చు పెడుతున్నారని రాష్ట్ర గిరిజన సంక్షేమ సంఘం నాయకులు విమర్శించారు. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో తెలంగాణ గిరిజన సంక్షేమ సంఘం నాయకులు మీడియాతో మాట్లాడుతూ లంబాడీలపైకి ఆదివాసులను కాంగ్రెస్ నేతలు ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు.
గత మూడు, నాలుగు రోజులుగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసులు, లంబాడీల మధ్య కాంగ్రెస్ నాయకులు చిచ్చు పెడుతున్నారని ఆల్ ఇండియా బంజారా స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కరాటే రాజునాయక్ చెప్పారు. గిరిజనుల మధ్య గొడవలు పెట్టేందుకు కాంగ్రెస్ నేతలు కేవీపీ రామచంద్రరావు, ప్రేమ్ సాగర్ రావు, కొప్పుల రాజు డబ్బులు ఇస్తున్నారని వారు విమర్శించారు.
కొంతమంది కాంగ్రెస్ నేతలు లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. తరతరాలుగా కలిసిమెలిసి జీవిస్తున్న గిరిజనుల మధ్య గొడవలు పెడితే చూస్తూ ఊరుకోం అని హెచ్చరించారు. ప్రేమ్ సాగర్ రావు, గండ్ర సుజాత గిరిజనులను విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. 60 అసెంబ్లీ నియోజకవర్గాల్లో లంబాడీల ఓట్లు కీలకం అన్ని విషయం గుర్తుపెట్టుకోవాలని చెప్పారు.