వైఎస్ జగన్. ప్రస్తుతం ఏపీలో కొనసాగుతున్న అరాచక పాలనతో భయాందోళనలో ఉన్న ప్రజల గుండెల్లో ధైర్యం నింపుతున్న పేరిది. ప్రజా సంకల్ప యాత్ర పేరిట తమ సమస్యలను తెలుసుకునేందుకు జగనన్న వస్తున్నాడని, జగన్ వద్ద తమ సమస్యలను విన్నవించేందుకు, అలాగే ప్రభుత్వ అరాచక పాలనపై జగనన్నతో చెప్పేందుకు, చంద్రబాబు పాలనతో తమ ప్రాంతాల్లో కుంటుపడిన అభివృద్ధిపై విన్నవించేందుకు ప్రజలు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు.
కాగా, ఇప్పటికే కడపలో తన పాదయాత్ర పూర్తి చేసుకున్న వైఎస్ జగన్, ప్రస్తుతం కర్నూలు జిల్లాలో ప్రజా సంకల్ప యాత్రను కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే బుధవారం బేతంచర్ల మండలం వెంకటగిరి గ్రామంలో పాదయాత్రను ప్రారంభించగా.. వైఎస్ జగన్ వస్తున్నారని సమాచారం తెలుసుకున్న అక్కడి ప్రజలు జగన్‌కు స్వాగతం పలికారు. వినతిపత్రాలతో వెల్లువెత్తారు. తమ ప్రాంత సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని జగన్‌తో విన్నవించుకున్నారు.
తమ సమస్యలు పరిష్కరించాలంటూ వచ్చిన వారిలో ఓ చిన్నారిని చూసి చలించిపోయారు వైఎస్ జగన్. లీలావతి అనే చిన్నారికి పోలియో సోకడంతో కుడికాలు పై భాగంం బలహీన పడింది. ఆ చిన్నారి సమస్య విన్న జగన్ తన అరచేతిలోకి తీసుకుని పరిశీలించారు. ఇప్పటికీ చిన్నారులు పోలియోబారిన పడుతుండటంపై జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, గడిచిన కొన్ని రోజులుగా ప్రజా సంకల్ప యాత్రలో ప్రజారోగ్యంపై జగన్ దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో మరో మహిళ వచ్చి వైఎస్ జగన్ వద్ద గోడు వెల్లబోసుకుంది. కాళ్లపై పెద్ద పెద్ద బొబ్బలు కనిపించాయి. ఎంత పెద్ద వైద్యుల వద్దకు వెళ్లినా ఫలితం లేదని జగన్ వద్ద వాపోయింది ఆ మహిళ. వీరిద్దరే కాదు.. ఆ గ్రామంలో అందరూ పలు వ్యాధుల బాధితులే. వారిని చూసిన జగన్ చలించిపోయాడు. ప్రజల బాధలు, వ్యాధులు తెలుసుకున్నారు.
తెలుసుకోవడమంటే ఏదో మొక్కుబడిగా పలకరించి పోవడం కాదు. బాధితుల కష్టాన్ని తన కష్టంగా భావిస్తున్నారు వైఎస్ జగన్. ప్రజల సమస్యలను తెలుసుకున్న వెంటనే పరిష్కారానికి పార్టీ శ్రేణులను, వ్యక్తిగత సిబ్బందిని ఆదేశిస్తున్నారు. ఇలా ప్రజా సంకల్పయాత్ర ఆద్యంతం ప్రజల సమస్యలను వింటూ.. సమస్యలకు పరిష్కారాలను కనుగొంటూ.. ప్రజల సంక్షేమంపై తీసుకోవాల్సిన చర్యల ప్రణాళికలను తన డైరీలో రాస్తూ తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు వైఎస్ జగన్.