నిరాధార ఆరోపణలు చేయడం ద్వారా వార్తల్లో నిలవాలనే ఆలోచన నుంచి కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి బయటకు రావాలని మండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి కోరారు. హైదరాబాద్ మాదక ద్రవ్యాల అడ్డాగా మారిందన్న రేవంత్‌రెడ్డి ఆరోపణలపై ఆయన స్పందించారు. టీఆర్‌ఎస్‌ఎల్పీలో మీడియాతో మాట్లాడుతూ…సన్ బర్న్ షో కు సీఎం కేసీఆర్ కుటుంబానికి ఎలాంటి సంబంధాలు లేవన్నారు. అనవసరపు విమర్శలు చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. రేవంత్ కు దమ్ముంటే చేసిన ఆరోపణలపై చర్చకు రావాలని సవాల్ విసిరారు.
హైదరాబాద్ నగరం డ్రగ్స్ జోన్‌లో లేదని నార్కోటిక్స్ విభాగం చెప్పినప్పటికీ…సంబంధంలేని విషయాలపై రచ్చ చేస్తున్నారని ఎమ్మెల్సీ పల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త పబ్బులకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదని తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేకాట క్లబ్‌లు మూతపడ్డ విషయాన్ని గుర్తుచేశారు. హైదరాబాద్ నగరం డ్రగ్స్ ఫ్రీ సిటీగా మారిందని వెల్లడించారు. చంద్రబాబు వేసిన బొక్కలు తిని రేవంత్‌రెడ్డి కుక్కలా పనిచేస్తున్నాడని పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.
ఈ నెల 28 నుంచి హైదరాబాద్‌లో ప్రపంచ పారిశ్రామికవేత్తల సమావేశం జరుగుతుండంటం, ప్రధానితో పాటు ఇవాంక ట్రంప్ వస్తున్న నేపథ్యంలో కొలువుల కొట్లాటను వాయిదా వేసుకోవాలని సూచించారు. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు నేపథ్యంలో కొలువుల కొట్లాటను వాయిదా వేసుకోవాలని కోర్టుకు, జేఏసీకి తెలిపామన్నారు. అయినప్పటికీ విపక్షాలు ఉద్దేశపూర్వక రాద్దాంతం చేయడం సరికాదన్నారు.