ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ బిజీబిజీగా గడిపారు. కేంద్రమంత్రులు చౌదరి బీరేందర్‌సింగ్, సుష్మాస్వరాజ్, హర్‌దీప్ పూరీతో మంత్రి కేటీఆర్ వరుసగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై కీలక సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్‌తో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ పునః విభజన చట్టంలో పొందుపరిచినట్లు బయ్యారం స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని ప్రధాని మోడి, స్టీల్ శాఖ మంత్రిని సీఎం కేసీఆర్ కోరారని వివరించారు. సీఎం కేసీఆర్ విజ్ఞప్తి నేపథ్యంలో ఒక టాస్క్ ఫోర్స్ ను కేంద్ర స్టీల్ శాఖ ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేందర్ సింగ్ ఫోన్ చేసి తమ అభిప్రాయాలను వినిపించాలని కోరారని…అందులో భాగంగా ఉన్నతాధికారులతో ఈ రోజు టాస్క్ ఫోర్స్ కమిటీలో మా అభిప్రాయాలను వినిపించామని తెలిపారు.
ప్రాథమిక అంచనాల ప్రకారం 70 మిలియన్ మెట్రిక్ టన్నుల ముడి ఇనుము బయ్యారంలో ఉందని మంత్రి కేటీఆర్ వివరించారు. ఎన్ఎండీసీ ద్వారా చత్తీస్ ఘడ్ బైలా జిల్లాలో ఉన్న 170 మిలియన్ మెట్రిక్ టన్నులను కలిపి బయ్యారంలో ఏర్పాటు చేయాలని కోరామన్నారు. అప్పుడు 3 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు అవుతుందని సూచించామన్నారు. ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్సాహంగా ఉందని తెలిపామన్నారు. ఈ రోజు జరిగిన టాస్క్ ఫోర్స్ మీటింగ్ లో అన్ని అంశాలపై చర్చించినా, రెండు, మూడు చిన్న సమస్యలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ సమస్యలపై నెలరోజుల్లో పరిష్కారం తీసుకురావాలని కేంద్ర మంత్రి అధికారులను సూచించారన్నారు. డిసెంబర్ నెల అఖరు కల్లా బయ్యారం స్టీల్ ప్లాంట్ పై ఒక స్పష్టత వస్తుందని ఆశిస్తున్నామన్నారు.
డిసెంబర్ 8న ఎన్ఎండీసీ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి హైదరాబాద్ రానున్నారని మంత్రి కేటీఆర్ వివరించారు. ఈ లోపు ఇంకా ఏవైనా సమస్యలు వస్తే, కేంద్ర మంత్రి హైదరాబాద్ పర్యటనలో ఆయన దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ ప్రాజెక్ట్ ఆచరణ సాధ్యమైనదా కాదా? అన్నదానిపై ఈ రోజు నివృత్తి జరిగిందని అన్నారు. ఆచరణ సాధ్యమైన ఈ ప్రాజెక్ట్ కు ఎన్ఎండీసీ, సెయిల్ ద్వారా డబ్బులు పెట్టాలని కోరామని తెలిపారు. మెకాన్, ఉన్నతాధికారులతో కలిసి ఫైనల్ రిపోర్ట్ ను మీరే తయారు చేయండి అని మంత్రి సూచించారని మంత్రి కేటీఆర్ తెలిపారు. డిసెంబర్ 8 ఎన్ఎండీసీ వార్షికోత్సవంలో బయ్యారం ప్లాంట్ ను ప్రకటిస్తారని ఆశిస్తున్నామన్నారు. ప్లాంట్ ఏర్పాటు విషయం కేంద్ర మంత్రి మాటల్లోనే వింటే బాగుంటుందని…ఆ ప్రకటన తాను చేస్తే బాగోదని తెలిపారు.
Post Views: 262