కంగనా రనౌత్, ప్రస్తుతం బాలీవుడ్‌లో ఎక్కువ పారితోషకం తీసుకునే నటుల్లో ఈమె ఒకరు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం ఈమె నైజం. అంతేకాదు, ఫ్యాషన్‌గా ఉండే నటిగానూ కంగనా రనౌత్ మీడియాలో ఎక్కువ ప్రఖ్యాతగాంచారు. ఈమెకు ఇప్పటి వరకు మూడు జాతీయ పురస్కారాలు, నాలుగు ఫిలింఫేర్ పురస్కారాలు అందుకున్నారు కూడా. 2015లో కంగనా రనౌత్ ద్విపాత్రాభినయం చేసిన తను వెడ్స్ మను రిటర్న్స్ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అవడంతోపాటు.. ఆమె నటనకు ఫిలింఫేర్ విమర్శకుల పురస్కారం, వరుసగా రెండో జాతీయ ఉత్తమ నటి పురస్కారాలు లభించాయి.
అయితే, ఈ బ్యూటీ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో మణికర్ణిక చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటున్న సమయంలో కంగనా రనౌత్ కుడియాలికి గాయమైంది. దీనిని గమనించిన చిత్ర బృందం వెంటనే ఆమెను హాస్పిటల్‌లో చేర్పించారు. గాయానికి కట్టుకట్టిన డాక్టర్లు 2వారాలు బెడ్ రెస్ట్ తప్పదని సూచించారు. దీంతో మణికర్నిక షూటింగ్ ఆగిపోయింది.
కాగా, కంగనా రనౌత్‌పై భారీ యాక్షన్ సీన్స్ ప్లాన్ చేశాడు దర్శకుడు క్రిష్. అందులో భాగంగా 40 అడుగుల ఎత్తున్న గోడపై నుంచి కంగనా రనౌత్ తన దత్తపుత్రుడు దామోదర్‌ను వీపుకు కట్టుకుని దూకాల్సిన సీన్ అది. అయితే, పైనుంచి దూకే క్రమంలో కంగనా రనౌత్ వీపు భాగాన ఉన్న ఆ పిల్లాడు జారిపడ్డాడట. దీంతో పిల్లాడ్ని కాపాడే క్రమంలో కంగనా కాలికి తీవ్ర గాయం కావడంతో మణికర్ణిక షూటింగ్ ప్రస్తుతం ఆగిపోయింది.