అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా…ఈ పేరు ఇటీవల ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోంది. అంతకంటే ఎక్కువగా హైదరాబాద్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈనెల 28వ తేదీన ప్రారంభం కానున్న గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ షిప్ సమ్మిట్‌కు ఇవాంకా హాజరుకానుంది. అయితే ఇవాంక అమెరికా తరఫున హైదరాబాద్లో పర్యటన వెనక కారణమేంటి? భాగ్యనగరంలో ఆమె ఎలాంటి సందేశం ఇవ్వబోతోంది? అనేది అన్నివర్గాల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశమే.
అగ్రరాజ్యం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్ట్ ట్రంప్ కుమార్తె అయిన ఇవాంక గతంలో అగ్రరాజ్యం అధ్యక్షులుగా పనిచేసిన వారి వారసులకు భిన్నం ఇవాంకా తీరు. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ సలహాదారుగా వ్యవహరిస్తున్న ఇవాంకా ఆ హోదాలో అమెరికా దేశ, విదేశీ వ్యవహారాల్లో కీ రోల్ ఆమెదే. ముఖ్యంగా అమెరికా-ఐక్యరాజ్యసమితి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తోంది. ప్రపంచాన్ని కుదిపేస్తున్న లింగవివక్ష, మానవుల అక్రమ రవాణా, శరణార్ధుల సమస్యలతో పాటు మహిళల సాధికారత లాంటి కీలక అంశాలపై విలువైన సలహాలు, సూచనలు అందజేస్తోంది.
ముఖ్యంగా సెప్టెంబర్ లో హ్యూమన్ ట్రాఫికింగ్ పై ఐక్యరాజ్య సమితిలో ఇవాంక ప్రసంగం అందరినీ ఆలోచింపజేసింది. వెట్టిచాకిరి, మహిళా సమస్యలపై ప్రపంచ సదస్సుల్లో పాల్గొంటూ అలుపెరుగని పోరాటం చేస్తోంది. సదస్సుల ద్వారా ఆయా దేశాల దృష్టికి సమస్యను తీసుకొస్తోంది. మహిళా సాధికారత, మానవుల అక్రమ రవాణాపై చర్చిస్తోంది. మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడేలా చేయాలన్నది ఆమె లక్ష్యం. మహిళా సమస్యలపై సీరియస్ గా పోరాటం చేస్తున్న ఇవాంకా .. హైదరాబాద్ లో పర్యటించనుంది. భాగ్యనగరంలో గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సదస్సులో పాల్గొననుంది. ఈ టూర్ కన్ఫామ్ కాగానే.. భారత విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ తో ఆమె భేటీ అయ్యింది. సెప్టెంబర్ లో ఐక్యరాజ్య సమితి భద్రతామండలి సమావేశాల్లో పాల్గొనడానికి సుష్మా న్యూయార్క్ వెళ్ళినప్పుడు .. హైదరాబాద్ మీటింగ్ అంశాలపై ఇవాంకా చర్చించింది. ప్రధానంగా మహిళా పారిశ్రామికవేత్తల అంశంపైనే వీళ్ల మధ్య చర్చ జరిగింది. ఇటీవల కాలంలో డొనాల్డ్ ట్రంప్ విదేశీ పర్యటనకు వచ్చినప్పుడు.. ట్రంప్ కంటే ముందే ఆయా దేశాల్లో పర్యటిస్తోంది. ఇలా ఇవాంకా అమెరికా అధ్యక్షుడి వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తోంది.