హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోమారు కలకలం రేకెత్తించే కామెంట్లు చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజ్‌పుత్ కర్ణసేన అధ్యక్షుడు లోకేందర్ సింగ్ కల్వితో కలిసి మాట్లాడారు. రాజ్‌పుత్‌ల ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ తెరకెక్కించిన పద్మావతి చిత్రాన్ని వెంటనే బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. రాజస్థాన్‌లో పద్మావతిని దేవతలా పూజిస్తారని, కాని దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ పూర్తిగా చరిత్రను వక్రీకరిస్తూ సినిమాను తీశారన్నారు.
సంజయ్ లీలా గతంలో కూడా రామ్‌లీలా, బాజీరావు మస్తాని చిత్రాలను నిర్మించాడని, అందులో కూడా చరిత్రకు విరుద్దంగా సన్నివేశాలను జోడించాడని రాజాసింగ్ ఆరోపించారు. ఈ చిత్రానికి కాంగ్రెస్ నేత శశీథరూర్ మద్దతుగా నిలుస్తున్నాడని, అతనికి దమ్ముంటే సోనియా గాంధీ లవ్ స్టోరీ, ఆమె చరిత్రను తెరకిక్కించాలని, అప్పుడు తాము ఉచితంగా ప్రచారం చేస్తామన్నారు. ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలని కోరుతున్న తమకు కరాచీ, దుబాయిల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, సంజయ్ లీలా బన్సాలీ వెనుక పాక్ దేశం హస్తం ఉన్నట్లు అనుమానం కలుగుతుందని రాజాసింగ్ ఆరోపించారు. ఆయనకు దమ్ముంటే ఔరంగజేబ్, టిప్పుసుల్తాన్ల సినిమాను తీయాలని సవాల్ చేశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చొరవ చూపి దేశ వ్యాప్తంగా ఆ చిత్రాన్ని నిషేదించాలని, సినిమా రీళ్లను దగ్దం చేయాలని రాజాసింగ్ కోరారు. తెలంగాణ రాష్ట్రంలో 15 లక్షల మంది రాజ్‌పుత్ ఉన్నారని, వారికి యావత్ హిందూ సమాజం మద్దతుగా నిలుస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇప్పటికే లేఖ రాశామని, రాష్ట్రంలో రాజ్‌పుత్‌లా ఆత్మగౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని నిషేదించాలన్నారు.
Post Views: 280