ఏపీ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఆద్యంతం విజయవంతంగా కొనసాగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు, నాయకులు, కార్యకర్తలతోపాటు ప్రజలు జగన్ అడుగులో అడుగు వేస్తూ పాదయాత్రలో నడుస్తున్నారు. తాజాగా జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర బేతంచర్ల వద్ద 200 కిలో మీటర్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో బేతంచర్ల గ్రామంలో మొక్కను కూడా నాటారు వైఎస్ జగన్.
అయితే, జగన్ ఎప్పుడూ పేదల గురించి, వారి సంక్షేమంపై ఆలోచిస్తారన్న మాట మరోసారి రుజువైంది. ఇందుకు కారణం బేతంచర్లలో జరిగిన ఘటనే. ఇంతకీ అక్కడ ఏం జరిగిందనేగా మీ డౌటు..
ప్రజా సంకల్ప యాత్ర బేతంచర్లకు వస్తుందని తెలుసుకన్న మాదిగ దండోర నాయకులు జగన్‌ను కలిశారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై స్పష్టమైన బహిరంగ ప్రకటన చేసి, ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్ లో అమోదించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని జగన్‌ను వారు కోరారు. ఈ విషయంపై జగన్‌కు వారు వినతి పత్రాన్ని కూడా అందించారు. జగన్‌కు వినతిపత్రం అందించిన వారిలో మాదిగ, డోన్ నియోజకవర్గం అధ్యక్షులు జొల్లు వెంకటేశ్వర్లు మాదిగ తో పాటు బేతంచెర్ల మండల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
వారి నుంచి వినతిపత్రం స్వీకరించిన వైఎస్ జగన్.. మాదిగ దండోర నాయకులను ఆలింగనం చేసుకున్నారు. అనంతరం జగన్ వారితో తప్పకుండా మీకు న్యాయం చేస్తా, ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా తాను రాస్తున్న డైరీలో దళితులకు సంబంధించి సంక్షేమ కార్యక్రమాలపై ప్రణాళికలు రూపొందిస్తున్నా.., మన పార్టీ దళితుల పార్టీ అని ఆనాడే చెప్పా, నాకు దళితులంటే అభిమానం, ప్రేమ, ఆప్యాయత చూపిస్తా అంటూ జగన్ చెప్పిన మాటలతో దండోర నాయకుల్లో ఆనందం వెల్లువిరిసింది.