జగన్ పాదయాత్ర దుమ్మరేపడంతో ఇప్పటికే టీడీపీ బ్యాచ్‌కి చుక్కలు కనబడుతుంటే.. తాజాగా బుధవారం కృష్ణాజిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా లేఖ కలకలం సృష్టించింది. అసలు విషయం ఏంటంటే డెల్ట్ షుగర్స్ విషయంలో సీఎంవో అధికారులు తన పట్ల అమర్యాదగా ప్రవర్తించారనే కారణంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురి అయిన వంశీ రాజీనామాకి సిద్ధపడ్డారని సమాచారం.
ఈ నేపథ్యంలో తన రాజీనామా లేఖతో స్పీకర్ వద్దకు వెళ్లేందుకు యత్నించారట.. ఆ విషయాన్ని గమనించిన మరో టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్..వంశీ వద్ద నుంచి రాజీనామా లేఖను తీసుకుని చింపివేశారు. అంతేకాకుండా ఈ విషయాన్ని మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో వంశీని బుజ్జగించే అంశాన్ని పార్టీ సీనియర్ నేత కళా వెంకట్రావుకు అప్పగించారు.
ఇక డెల్టా షుగర్స్ విషయానికి వస్తే.. హనుమాన్ జంక్షన్‌లో ఉన్న డెల్టా షుగర్స్ సంస్థ గత నాలుగు నెలలుగా మూతపడింది. హనుమాన్ జంక్షన్ నుంచి తణుకు ప్రాంతానికి తరలించాలనే ప్రతిపాదన ఉంది. అయితే తన నియోజకవర్గం నుంచి డెల్టా షుగర్స్‌ను తరలించవద్దని, అనేకమంది రైతుల జీవితాలు ఆధారపడి ఉన్నాయంటూ ఈ విషయంపై ఎమ్మెల్యే వంశీ బుధవారం కొంతమంది రైతులతో కలిసి ముఖ్యమంత్రితో మాట్లాడేందుకు వెళ్లారట.
అయితే సీఎంవో కార్యాలయానికి చెందిన ఓ అధికారి.. ఎమ్మెల్యే వంశీని అడ్డుకుని, విషయం తమతో చెప్పాలని, సీఎంను కలిసేందుకు ఇప్పుడు వీలు కాదని చెప్పడంతో… ఇరువురి మధ్య వాగ్వివాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గిరిజా శంకర్ ఆయనతో సరైన రీతిలో వ్యవహరించలేదని.. తనపట్ల దురుసుగా ప్రవర్తించడంతో వంశీ మనస్తాపంతో రాజీనామాకు సిద్ధపడినట్లు సమాచారం. దీంతో వల్లభనేని వంశీ రాజీనామా టీడీపీలో పెద్ద కలకలం రేపిందని సర్వత్రా చర్చించుకుంటున్నారు.