కోళ్ల పరిశ్రమకు పుట్టిల్లు తెలంగాణ అని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. పౌల్ట్రీ రంగం పితామహుడు బీవీ రావ్ తెలంగాణ కీర్తి ప్రతిష్టలు పెంచారని అయన చెప్పారు. హైదరాబాద్ హైటెక్స్ లో మూడు రోజుల పాటు జరగనున్న పౌల్ట్రీ ఇండియా-2017 ఎగ్జిబిషన్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడిన మంత్రి… కోళ్ల పరిశ్రమను వ్యవసాయ అనుబంధ పరిశ్రమగా గుర్తించాలని మొట్టమొదట కేంద్రానికి లేఖ రాసింది తెలంగాణ ప్రభుత్వమేనన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పౌల్ట్రీ రంగానికి అనుకూలంగా ఉన్నారని తెలిపారు. అంగన్ వాడీ కేంద్రాలు, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు గుడ్లు, చికెన్ పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారని మంత్రి గుర్తుచేశారు.
పౌల్ట్రీ రంగానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయం అందిస్తుందని ఈటెల భరోసా ఇచ్చారు. మక్కల ధర పెరిగి పౌల్ట్రీకి ఆర్థిక భారమైతే సబ్సిడీ మీద ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ అని గుర్తుచేశారు. హేచరీస్, దాణా తదితర కోళ్ల పరిశ్రమకు సంబంధించిన వాటికి సబ్సిడీ ఇస్తున్నామని తెలిపారు. కోడిగుడ్ల ఉత్పత్తి, దాణా ఉత్పత్తిలో రాష్ట్రం నంబర్ వన్ గా ఉందని, బ్రాయిలర్ కోళ్ల ఉత్పత్తిలో రెండో స్థానం నుంచి మొదటి స్థానానికి తీసుకువస్తామని మంత్రి ఈటెల చెప్పారు.మిషన్ భగీరథ కింద పరిశ్రమలకు 10 శాతం నీళ్లు రిజర్వ్ చేశామని, వాటి నుంచి కోళ్ల పరిశ్రమకు కూడా సురక్షితమైన నీళ్లు సరఫరా చేస్తామని అన్నారు. గతంలో కరెంట్ కోతల వల్ల లక్షలాది కోళ్లు చనిపోతే కోట్ల రూపాయల నష్టం వచ్చిందని ఆయన గుర్తుచేశారు.ఈ ఎగ్జిబిషన్‌లో పౌల్ట్రీ ఎగ్జిబిటర్లు, రైతులు పాల్గొన్నారు.