పిల్లలు ఏ పని చేసినా కష్టపడి, ఇష్టపడి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన బాలల హక్కుల వారోత్సవాలు, చిల్డ్రన్ ఫెస్ట్ -2017 ముగింపు ఉత్సవాలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, హోంమంత్రి నాయిని నాయిని నర్సింహారెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ కావాలంటే అన్ని వర్గాలు బాగుపడాలన్నారు. గర్భంలో ఉన్న బిడ్డ నుండి ఎదిగే వరకు అన్ని రకాలుగా ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తోందని చెప్పారు. విద్య, వైద్యంతో పాటు అన్ని రకాల సౌకర్యాలు, అవకాశాలు తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. పిల్లలు బాగుంటేనే భవిష్యత్ తెలంగాణ బాగుంటుందన్నారు.
పిల్లలను మంచిగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, లేకపోతే సమాజం తప్పుదోవ పడుతుందని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అభిప్రాయపడ్డారు. పిల్లలపై జరుగుతున్న అకృత్యాలు ఆపడానికి పోలీస్ శాఖ అనేక కార్యక్రమాలు చేపడుతోందని చెప్పారు. చదువుతో సంస్కారం వస్తుందని, జీవితాలు బాగుపడతాయని హోంమంత్రి నాయిని చెప్పారు. పిల్లల కోసం ప్రభుత్వం 500లకు పైగా రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసిందని తెలిపారు. పిల్లలందరు బాగా చదువుకోవాలని, ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని భరోసా ఇచ్చారు.పోలీస్ శాఖ ఉన్నతాధికారి సౌమ్య మిశ్రా, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.