ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు ఏపీ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర
ప్రజల స్వాగతాలతో ఆద్యాంతం విజయవంతంగా కొనసాగుతోంది. తాజాగా కర్నూలు జిల్లా బేతంచర్ల మండలంలో వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, బేతంచర్ల గ్రామం వద్ద వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర 200 కిలోమీటర్లకు చేరుకుంది. కాగా, ఈ నేపథ్యంలో జగన్ తన ప్రజా సంకల్ప యాత్ర 200మైలు రాయిని దాటిన సందర్భంగా మొక్కను నాటారు. ప్రస్తుతం వెంకటగిరి, మర్రికుంట క్రాస్ రోడ్డు మీదుగా జగన్ పాదయాత్ర కొనసాగుతోంది.
వైఎస్ జగన్ తమ సమస్యలను తెలుసుకునేందుకు వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న యువత, మహిళలు, రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకుని స్వాగతం పలికారు. తమపై అధికార పార్టీ నేతలు చేస్తున్న దాడుల గురించి జగన్‌తో చెప్పుకున్నారు. నిరుద్యోగులైతే.. బాబు వస్తే జాబు వస్తుందని బూటకపు మాటలతో మభ్యపెట్టి.. తమ ఓట్లు దండుకుని.. అధికారం చేపట్టిన చంద్రబాబు సర్కార్ ఇంత వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా వదల్లేదని జగన్‌కు విన్నవించారు.