చెరుకు రైతులకు తమ పంటకు లాభసాటి ధర చెల్లించాలని చెరుకు ఫ్యాక్టరీల యాజమాన్యాలను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు కోరారు. రాష్ర్టంలోని చెరుకు అభివృద్ది సంఘాల చైర్మన్లు మరియు ఫాక్టరీల యాజమాన్యాలతో ఈ రోజు సచివాలయంలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి రైతులకు న్యాయం చేసే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్న అంశాలను గుర్తిచేశారు. ఈసారి మంచి వర్షాల వలన రాష్రంలో గత ఏడాది కన్నా అధికంగా చెరుకు ఉత్పత్తి అవుతుందన్న మంత్రి, వారికి లాభసాటి మద్దతు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ కోరారు.
ఈ సారి 24 లక్షల మెట్రిక్ టన్నులు క్రషింగుకు సిద్దంగా ఉందని, ఇప్పటికే రాష్ర్టంలో నాలుగు ఫ్యాక్టరీల్లో క్రషింగ్ ప్రారంభం అయినట్లు యాజమాన్యాలు తెలిపాయి. రాష్ట్రంలోని ఇతర పరిశ్రమల అభివృద్దికి సహకారం అందిస్తున్న తీరుగానే, చక్కెర పరిశ్రమ అభివృద్దికి కావాల్సిన సహకారం అందిస్తామని, ఇదే సమయంలో పరిశ్రమ సైతం రైతుకు మరింత అదాయం వచ్చేలా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. రాష్ర్టంలో చెరుకు పంటను సాగుచేస్తున్న రైతులకు ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా డ్రిప్ ఇరిగేషన్ వంటి సౌకర్యాలు కల్పించడం వలన దిగుబడి పెరుగుతన్నదని తెలిపారు. దీంతోపాటు అదర్శ వ్యవసాయ విధానాలను రైతులకు చేరేలా ఫ్యాక్టరీలు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ఈ సమావేశంలో ఖమ్మం ఏంపి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఏల్లా రెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Post Views: 504