తెలంగాణలోని ఉద్యోగార్థులకు మరో తీపికబురు. రాష్ట్రంలోని 79 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో టీచింగ్, నాన్ టీచింగ్ కలిపి మొత్తం 1,133 పోస్టులను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఆర్థికశాఖ సెక్రటరీ ఎన్ శివశంకర్ 1,133 పోస్టులను మంజూరు చేస్తూ 170 నంబరు జీవోను జారీచేశారు. 781 జూనియర్ లెక్చరర్ పోస్టులు, 43 ప్రిన్సిపాల్ పోస్టులు, 78 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు, 78 లైబ్రేరియన్ పోస్టులు, 77 సీనియర్ అసిస్టెంట్స్, 76 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయడానికి అనుమతించినట్టు జీవోలో పేర్కొన్నారు. భర్తీకి ఇంటర్మీడియట్ విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కాగా, టీఎస్పీఎస్సీ ద్వారా ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను త్వరలోనే ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తామని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అంటే 2007-2014 మధ్యకాలంలో ఏర్పాటు చేసిన 68 ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు పోస్టులు మంజూరు చేయలేదు. అలాగే 2015-16లో ఒకటి, 2016-17లో రెండు చొప్పున జూనియర్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. మరో 9 ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో కలిపి మొత్తం 1,133 పోస్టులను మంజూరు చేశారు.
Post Views: 202