పెళ్లయిన వారం రోజులకే నీ మీద నాకు ఆసక్తి లేదని చెప్పేశాడు భర్త. అంతేనా.. అప్పటినుంచి ఆత్మహత్య చేసుకోమని వేధిస్తున్నాడు. దీనికి తోడు అత్తింటివాళ్ల వరకట్న వేధింపులు కూడా తీవ్రమయ్యాయి. వేధింపులు రోజురోజుకు ఎక్కువవుతుండటంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల తెలిపిన కథనం ప్రకారం ఘట్‌కేసర్ మండలం ప్రతాప్‌సింగారం గ్రామానికి చెందిన అశ్విని(26)కి పోచారం పంచాయతీ పరిధి అన్నోజిగూడకు చెందిన బాలగోని సుమన్‌గౌడ్‌తో 2016, డిసెంబర్ 8న వివాహం జరిగింది. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహమే. వివాహ సమయంలో అశ్విని తల్లిదండ్రులు రూ.3లక్షల నగదు, 25 తులాల బంగారు ఆభరణాలు కట్నంగా ఇచ్చారు.
పెళ్లయిన వారం రోజులకే భర్త సుమన్ గౌడ్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. పెళ్లయ్యాక ఐదు రోజులకు భార్యభర్తలు తిరుపతి వెళ్లొచ్చారు. అప్పటి నుంచి నీతో కాపురం చేసే ఉద్దేశం లేదని సుమన్ గౌడ్ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. అంతేకాదు.. అశ్వినికి అక్రమ సంబంధం ఉందని లేనిపోని ప్రచారం మొదలుపెట్టాడు. కాపురం చేసే ఉద్దేశం లేదని, కాబట్టి నువ్వు ఆత్మహత్య చేసుకోవాలని భార్య అశ్వినిని సుమన్ గౌడ్ నిత్యం వేధిస్తున్నాడు. అత్త మామలు ఆడుపడుచులు సైతం కట్నం కోసం ఆమెను వేధించడం మొదలుపెట్టారు. భర్త వేధింపులకు తోడు అత్త మామలు కూడా తోడవడంతో అశ్విని ఇక తట్టుకోలేకపోయింది.
కోరిక తీర్చమన్న మరిది:
భర్త సుమన్ గౌడ్ సోదరుడు నవీన్ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు. కోరిక తీర్చాలంటూ ఆమెను పలుమార్లు వేధించాడు. ఓ రోజు రాత్రి బయటకెళ్లిన భర్త కోసం ఎదురుచూస్తుండగా.. రాత్రి 11.30గం. సమయంలో నవీన్ తనను పడక గదిలోకి బలవంతంగా లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడని అశ్విని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను వేధిస్తున్న అత్తింటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.