తెలుగు సినీ పరిశ్రమకు సంబందించి ప్రతిష్టాత్మక నంది అవార్డులను ఎప్పుడైతే ఏపీ సర్కార్ ప్రకటించిందో.. అప్పటి నుండి సినీ రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే రేగుతుంది. అయితే నంది రగడ పై చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ స్పందించారు. నంది అవార్డుల విషయంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వారంతా ఎన్ఆర్ఏలు అంటూ వ్యాఖ్యానించారు. ఎన్ఆర్ఏ అంటే.. నాన్‌రెసిడెంట్ ఆంధ్రాస్ అన్న మాట.
ఆంధ్రాలో ఆధార్ కార్డూ, ఓటు లేనివాళ్లే హైదరాబాద్‌లో కూర్చొని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం శాసనసభ లాబీలో విలేకర్లతో మాట్లాడారు. నంది అవార్డుల విషయంలో కావాలని విమర్శలు చేయడం పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఫీలయ్యారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు రాకుండా హైదరాబాద్‌లో కూర్చుని మాట్లాడడంలో అర్థమేంటనీ.. లోకేష్ చేసిన వ్యాఖ్యల పై ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి ఫైర్ అయ్యారు.
2014 వరకూ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని, అప్పటివరకు, ఆ తర్వాత కూడా ఎవరైనా ఇక్కడ ఉండొచ్చని స్పష్టం చేశారు. ఆస్తులు పెంచుకుంటూ ఏపీలో కూర్చొని ఏదైనా మాట్లాడొచ్చా.. అని దుయ్యబట్టారు. విమర్శించే వాళ్లు నాన్ లోకల్ అయితే జ్యూరీలో ఉన్న సభ్యుల మాటేమిటని.. వారికి కూడా హైదరాబాద్ లోనే ఆధార్ కార్డులు ఉన్నాయి కదా అని ప్రశ్నించారు. వారు కూడా ఇక్కడే ట్యాక్స్ లు కడుతున్నారు కదా మరి వారిని జ్యూరీలోకి ఎలా తీసుకున్నారు.
తెలంగాణలో పన్నులు కడుతున్నందుకు.. తాము ఏపీ గురించి మాట్లాడకూడదా అని ప్రశ్నించారు. తెలంగాణలో మీకు ఇళ్లు, వ్యాపారాలు లేవా.. . నంది అవార్డుల వివాదం మరింత పెద్దది అయితే అవార్డులను రద్దు చేస్తారా.. ఒకటి రెండు విమర్శలు చేసినంత మాత్రాన అవార్డులను ఎత్తేస్తారా అని అన్నారు. టెంపర్ సినిమాకు తనకు వచ్చిన ఉత్తమ సహాయ నటుడు అవార్డును తిరస్కరిస్తున్నట్లు పోసాని కృష్ణమురళి ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ అవార్డు అందుకోవటానికి నేను సిగ్గుపడుతున్నానని పోసాని లోకేష్ ఫై విరుచుకు పడ్డారు.