షూ వేసుకురాలేదని తరగతి గదిలోకి అనుమతించకుండా బయటే నిలబెట్టి తోటి విద్యార్థులు ముందు తన కుమారుడిని మానసికంగా వేధించారంటూ శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యంపై విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కడియం ఆగ్రహం వ్యక్తం చేసారు . ఘటనపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. విచారణ నివేదిక ఆధారంగా దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. పాఠశాల యాజమాన్యాలు.. విద్యార్థులను అనవసరంగా ఇబ్బంది పెట్టొద్దు.. వేధించవద్దని ఆదేశించారు.
వివరాల్లోకి వెళితే …మదీనాగూడకు చెందిన చేతన్‌చౌదరి(12) మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌లో ఉన్న శ్రీనిధి ఇంటర్నేషనల్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. అక్టోబర్ 30న చేతన్‌చౌదరి కాలివేళ్లకు దెబ్బతగలడంతో షూ వేసుకోకుండా స్కూల్‌కు వెళ్లాడు. షూ వేసుకురాలేదంటూ పాఠశాల యాజమాన్యం విద్యార్థిని తరగతి గదిలోకి వెళ్లనియ్యకుండా బయట కూర్చోబెట్టారు. ఇలా రెండు రోజులపాటు బయట కూర్చోబెట్టడంతో విద్యార్థి మానసిక వేదనకు గురయ్యాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని అడుగగా.. మా పాఠశాలలో అలాంటి శిక్షలే ఉంటాయని పాఠశాల యాజమాన్యం స్పష్టం చేసింది. అప్పటి నుంచి చేతన్ పాఠశాలకు వెళ్లినా అందరూ హేళన చేస్తూ మానసిక క్షోభకు గురిచేశారు. కాగా సోమవారం చేతన్ పాఠశాలకు వెళ్లగా.. నీకు ఇంకా శిక్ష వేయాలని తరగతి గదిలోకి వెళ్లనివ్వకుండా బయట కూర్చోబెట్టారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సోమవారం రాత్రి మొయినాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ సునీత తెలిపారు. మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్న పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లి వాణి డిమాండ్ చేస్తున్నారు.