తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ నెల 24వ తేదీన యాదాద్రికి వెళ్లనున్నారు . యాదగిరిగుట్టలో జరిగే టీఆర్‌ఎస్వీ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు తుంగ బాలు వివాహానికి హాజరవుతారు. నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకుని యాదాద్రి అభివృద్ధి పనులపై సమీక్ష జరుపుతారు. యాదాద్రి అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టిన ముఖ్యమంత్రి గుట్టమీద జరిగే అభివృద్ధి పనులను స్తపతులు, ఆర్కిటెక్టులు, ఇంజినీర్లతో సమీక్షిస్తారు. ఇక్కడి పనులను ఆయన సమీక్షించడం ఇది తొమ్మిదోసారి. ఇప్పటికే ఎనిమిదిసార్లు యాదాద్రికి విచ్చేసి అభివృద్ధి పనులను సమీక్షించిన ముఖ్యమంత్రి మరోసారి ఆలయ పనులపై దిశానిర్దేశం చేయనున్నారు. ఆలయ ముఖమండపం పనులు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో సీఎం రాకకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. గతనెలలోనే యాదాద్రికి సీఎం వస్తారనే విషయం దాదాపు ఖరారై చివరిక్షణంలో వాయిదా పడిన విషయం తెలిసిందే . యాదాద్రి ఈవో గీతారెడ్డి మాట్లాడుతూ సీఎం పర్యటన ఖరారైందని, కొండపైన జరుగుతున్న ఆలయ విస్తరణ పనులను పరిశీలిస్తారని వివరించారు.
