వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలుగు భాషను తప్పనిసరి సబ్జెక్టుగా మొదటి తరగతి నుంచి ఇంటర్ వరకు అమలు చేయడం కోసం కావల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. అన్ని స్థాయిల్లో విద్యార్థులకు ఇబ్బంది కలగని రీతిలో తెలుగు భాషను తప్పనిసరిగా అమలు చేసేలా తెలుగు భాషను ఆసక్తికర సబ్జెక్టుగా, స్కోరింగ్ సబ్జెక్టుగా కూడా అభివృద్ధి చేయాలని సూచించారు. తెలుగు భాషను తప్పనిసరి సబ్జెక్టుగా చేయడంపై ఈ రోజు సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలుగు భాష తప్పనిసరి అమలుపై ఏర్పాటు చేసిన సబ్ కమిటీ సభ్యులు, విద్యాశాఖ అధికారులతో సమీక్ష చేశారు. తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాలలో మాతృభాషను తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేస్తున్న విధానాన్ని, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈలలో కూడా తెలుగు భాష తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయడంపై ఎలాంటి చర్యలు చేపట్టవచ్చో సూచించారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు తెలుగు భాష తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయడంపై ఈ సబ్ కమిటీ ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలపై అధ్యయనం చేసి నేడు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరికి వివరించింది.
తెలంగాణలో తెలుగు భాష మాతృభాష గా లేని పాఠశాలలు 1370 ఉన్నాయని, మొదటి తరగతి నుంచి ఇంటర్ వరకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలుగును తప్పనిసరి సబ్జెక్టు చేయడంలో ఎలాంటి ఇబ్బంది ఏర్పడే అవకాశం లేదని అధికారులు తెలిపారు. ఐదో తరగతి వరకు తెలుగు భాషను చదువుకోని వారికి ఆరో తరగతిలో అత్యంత సులభమైన పద్దతిలో సబ్జెక్టును నేర్చుకునే విధంగా పాఠ్యపుస్తకాలు రూపొందిస్తున్నామన్నారు. అదేవిధంగా ఏడో తరగతి వరకు తెలుగు చదువుకోని వారికి ఎనిమిదో తరగతిలో, పదో తరగతి వరకు చదువుకోని వారికి ఇంటర్ మొదటి సంవత్సరంలో తెలుగు భాషను సులభంగా నేర్చుకునేందుకు పుస్తకాలను రూపొందిస్తున్నామన్నారు.
సిబిఎస్ఈ, ఐసిఎస్ఈలలో కూడా తెలుగు భాషను తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయడంపై ఆయా ఉన్నతాధికారులతో మాట్లాడామని, అమలులో తమకెలాంటి అభ్యంతర లేదని చెప్పినట్లు ఉప ముఖ్యమంత్రికి సబ్ కమిటీ వివరించింది. సిబిఎస్ఈ, ఐసిఎస్ఈలలో మాతృభాషను తప్పనిసరి భాషగా ఆయా రాష్ట్రాల్లో అమలు చేయడానికి కావల్సిన నిబంధనలున్నాయని, ప్రస్తుతానికి అవి ఆయా పాఠశాలలు అమలు చేయడం లేదని సబ్ కమిటీ సభ్యులు తెలిపారు. అందువల్ల ఈ నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూస్తే సరిపోతుందని చెప్పారు. తెలుగుభాషను ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయడం, అమలు తీరును పర్యవేక్షించడానికి కమిటీ ఉండాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అభిప్రాయపడ్డారు. ఇందుకోసం ప్రస్తుతం ఏర్పాటైన సబ్ కమిటీని ‘‘ తెలుగు భాష అమలు సలహా సంఘం’’ గా మార్చుతున్నట్లు చెప్పారు. ఈ కమిటీ తెలుగు భాషను అన్ని విద్యా సంస్థల్లో తప్పనిసరి సబ్జెక్టుగా ఏ విధంగా అమలు చేయాలి, అమలులోని ఇబ్బందులను అధిగమించేందుకు ప్రభుత్వం తరపున ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అమలు విధానం ఎలా ఉందో పర్యవేక్షించేందుకు సూచనలు చేయాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కమిటీ సభ్యులను కోరారు. తెలుగు భాష తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయడంలో రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో పర్యవేక్షణ కమిటీలుండాలని, వాటి నిర్మాణం ఎలా ఉండాలో కూడా ఈ కమిటీ సూచించాలన్నారు.
తెలుగు భాషను తప్పనిసరి సబ్జెక్టుగా మార్చడంలో అది విద్యార్థులకు ఆసక్తికరంగా అభివృద్ధి చేయడంతో పాటు స్కోరింగ్ సబ్జెక్టుగా మార్చాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కమిటీ సభ్యులతో చర్చించారు. 2018-19విద్యా సంవత్సరంలో తె లుగు భాషను తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఇందుకు కావల్సిన సిలబస్, పుస్తకాలు తయారు చేయాలన్నారు.
ఈ సమావేశంలో విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రంజీవ్ ఆర్. ఆచార్య, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు కిషన్, తెలుగు భాష తప్పనిసరి సబ్జెక్టు అమలు సబ్ కమిటీ చైర్మన్ తెలుగు విశ్వవిద్యాలయం వీసి సత్యనారాయణ, కన్వీనర్ , ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, సభ్యులు, ముఖ్యమంత్రి ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, తెలుగు అధికార భాష కమిషన్ చైర్మన్ దేవులపల్లి ప్రభాకర్ రావు, ఎస్.సి.ఈ.ఆర్.టి డైరెక్టర్ శేషుకుమారి, తెలుగు అకాడమీ డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి, ప్రధానోపాధ్యాయులు సువర్ణ వినాయక్ తదితరులు పాల్గొన్నారు.